వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. ట్వీటాడినా, సినిమా లేదా వెబ్ సిరీస్ తీసినా వర్మ తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంటాడు.
పెళ్లిపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటితో పౌరసమాజానికి విభేదాలుండే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే పెళ్లి అనేది ఓ బుద్ధి తక్కువ వ్యవహారమని వర్మ దృఢమైన అభిప్రాయం.
ఈ నేపథ్యంలో మొదటి పెళ్లి పెటాకులైనా, తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైన హీరో సుమంత్‌పై వర్మ సోషల్ మీడియా వేదికగా తన మార్క్ సెటైర్లు విసిరాడు. అక్కినేని కుటుంబంతో సాన్నిహిత్యం రీత్యా… సుమంత్‌పై కాస్త పరుష పదజాలాన్ని కూడా వాడాడు. ఇంతకూ సుమంత్ పెళ్లిపై వర్మ ఏమన్నాడో చూద్దాం.
“ఒక్కసారి అయ్యాకా కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్, నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మ” అని వర్మ ట్వీట్ చేశాడు. ట్వీట్‌కు ఓ ఏమోజీని కూడా వర్మ జత చేయడం గమనార్హం. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'తొలిప్రేమ' చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ కీర్తిరెడ్డిని 2004లో సుమంత్ వివాహం చేసుకున్నాడు. 2006లో విడాకులు తీసుకున్నారు.
త్వరలో పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ పెళ్లి చేసుకోనున్నాడు. అందుకే వర్మ…పవిత్ర ఖర్మ అని చెప్పడం. మొత్తానికి ఎదుటి వాళ్లు ఏమనుకుంటారనే దానితో సంబంధం లేకుండా తన మనసులో మాటను బయటికి చెప్పడం వర్మ ప్రత్యేకత. మరోసారి సుమంత్ విషయంలో తన వైఖరితో ఆయన హాట్ టాపిక్‌గా నిలిచాడు.