విశాఖ మేయర్ దీక్షకు రెడీ… ?

విశాఖ మేయర్ గా బాధ్యతలు చేపట్టి కొద్ది నెలలే గడిచాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అదే పార్టీకి చెందిన మేయర్ ఆందోళన చేపట్టడం అన్నది మామూలుగా ఎక్కడా అసలు జరగదు. హాయిగా తన…

విశాఖ మేయర్ గా బాధ్యతలు చేపట్టి కొద్ది నెలలే గడిచాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అదే పార్టీకి చెందిన మేయర్ ఆందోళన చేపట్టడం అన్నది మామూలుగా ఎక్కడా అసలు జరగదు. హాయిగా తన పదవీకాలాన్ని ప్రజాసేవలో పూర్తి చేయాల్సిన మేయర్ వీధుల్లోకి రానున్నారుట.

అవును. విశాఖ మేయర్ హరి వెంకట కుమారి దీక్షకు రెడీ అవుతున్నారు. ఆమె ఒక్కరే కాదు, జీవీఎంసీలో ఉన్న వైసీపీ కార్పోరేటర్లు అంతా ఒక రోజు దీక్ష చేస్తున్నారు. వారంతా చేపట్టబోయే ఈ ఆందోళన వెనక ధర్మాగ్రహం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం అడ్డగోలుగా ప్రైవేట్ పరం చేస్తోంది. దాంతో పాటుగా దూకుడుగా ముందుకు వెళ్తోంది.

ఎక్కడా వెనక్కు తగ్గడంలేదు. తాజాగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోనూ ప్రైవేట్ పరం చేయడం తప్పదు అని పేర్కొంది. దీంతో విశాఖలో ప్రజా ప్రతినిధులు ఇపుడు  రంగంలోకి దిగుతున్నారు. అయిదు నెలల క్రితం జనం ఓట్లతో గెలిచిన కార్పోరేటర్లు అంతా కూడా ఇపుడు స్టీల్ పోరులో ముందుకు వస్తున్నారు.

మేయర్ వెంకటకుమారి నాయకత్వంలో అంతా దీక్ష చేయడం ద్వారా కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరనున్నారు. ఆగస్ట్ 2న మేయర్ నాయకత్వాన ఈ దీక్ష జరుగుతోంది. అదే సమయంలో ఢిల్లీ వీధులలో జంతర్ మంతర్ వద్ద ఉక్కు కార్మిక సంఘాలు కూడా అతి పెద్ద ఆందోళన చేపట్టనున్నారు. 

ఇలా ఇంటా బయటా జరిపే నిరసనలు కేంద్రం చెవులకు ఎక్కుతాయా అంటే చూడాలి మరి. ఇది ఒక బృహత్తర  ప్రయత్నమని, దీని తరువాత తుది పోరుకు కూడా తాము రెడీ అవుతామని ఉక్కు కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కధ క్లైమాక్స్ కి చేరుతున్నట్లే అనుకొవాలి.