ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అద్వితీయ పాత్ర గురించి తెలుగు సమాజానికి బాగా తెలుసు. ప్రస్తుత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. తండ్రి వైఎస్సార్ కలల ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో జగన్ ఉన్నారు.
విభజన చట్టంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేర్చారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. కారణాలేవైనా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు …అడిగి మరీ తీసుకున్నారు. ఇదే ఏపీకి శాపంగా మారింది.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో సగం ఖర్చు మాత్రమే భరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర జలశక్తిశాఖ అంగీకరించినట్టు వైసీపీ ఎంపీలు ప్రకటించారు.
ఇదే నిజమైతే మాత్రం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ సూపర్ సక్సెస్ అయినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంచనా వ్యయానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖకు, కేంద్ర మంత్రిమండలికి పంపి ఆమోదింపజేస్తామని జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాలని కోరుతూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కీలక చర్చలు జరిపారు. సమావేశ వివరాలను విజయసాయిరెడ్డి వెల్లడించారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు.
అంచనా వ్యయం రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపితే మాత్రం పోలవరం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కావు. ఎన్నికలకు ఏడాది ముందే పోలవరం నిర్మాణం పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందించిన ఘనతను జగన్ సొంతం చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు ఏ మాత్రం కట్టుబడి ఉంటుందో కాలమే తేల్చాల్సి వుంది.