ఆంధ్రప్రదేశ్ రాజకీయం బూతులమయమైంది. ఇష్టానుసారం తిట్టుకొంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలను మాత్రమే విన్నాం, చూశాం. ఇప్పుడు ఏపీలో ట్రెండ్ మారింది. ప్రెస్మీట్లు పెట్టి మరీ లైవ్‌లో బూతులను యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. అసభ్యకర పదజాలాన్ని ప్రయోగించడానికి రాజకీయ నాయకులు ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై మాట్లాడే బూతులను వినలేక జనం సిగ్గుపడుతున్న దుస్థితి.
ప్రత్యర్థులపై ఎంత దారుణంగా బూతులు మాట్లాడితే అధినేతలకు అంత బాగా నచ్చే పరిస్థితి. నోటికి బూతులు తగిలించుకున్న నేతలే అధినేతలకు ఇష్టమైన వారిగా గుర్తింపు పొందుతున్నారు. అధినేతల మనసెరిగిన వారు సులభంగా కీలక పదవులు పొందగలుతున్నారు. బూతులు మాట్లాడే వాళ్లకే మంచి భవిష్యత్ అన్నట్టుగా రాజకీయాలు తయారయ్యాయి.
అధినేతల మనసెరిగిన పోకిరీ నేతలు …అందలం ఎక్కడానికి సులభ మార్గాలను ఎంచుకున్నారు. ప్రజలతో సంబంధం లేకుండానే అధినేతల వద్ద పలుకుబడి సంపాదిస్తున్నారు. ప్రధాన మీడియా ప్రసారం చేయదని భావిస్తే, చక్కగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ లైవ్‌లో ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రత్యర్థుల మహిళలను బజారుకీడ్చేందుకు ఏ మాత్రం వెనుకాడని నీచస్థాయికి రాజకీయాలను దిగజార్చారు. ఇలా అంతిమంగా అధినేతల కుటుంబాల్లోని మహిళలు టార్గెట్ కావడం ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న విష సంస్కృతిగా చెప్పొచ్చు.
జగన్ కుటుంబంలోని మహిళలను టీడీపీ దుర్మార్గంగా టార్గెట్ చేస్తోందని వైసీపీ, అలాగే అధికార పార్టీ చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్‌ని దూషిస్తోందని టీడీపీ… ఇలా రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక జనసేన అరాచకం మరో లెవెల్లో వుంటుంది. కాకపోతే ఆ పార్టీకి అధికారంలోకి రావాలనే ఆశ, పట్టుదల లేకపోవడంతో జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా వైఎస్ జగన్ బలహీనతను కొందరు బాగా వాడుకుంటున్నారు. ఇంతకాలం చంద్రబాబు, లోకేశ్‌లను మాత్రమే తిట్టివాళ్లే. అలాగే జగన్‌పై దారుణ కామెంట్స్ చేసేవాళ్లు. ఇప్పుడు దిగజారిన రాజకీయాల పుణ్యమా అని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల కుటుంబాల్లోని మహిళలు టార్గెట్ అయ్యారు. ఇది ఎంత వరకూ దారి తీస్తుందో తెలియని ఆందోళన పరిస్థితి నెలకుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ రాజకీయ కాలుష్యం చివరికి వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది. పార్టీలకు, నేతల మెడకు ఏదో రోజు చుట్టుకుంటుంది. ఊపిరాడకుండా చేస్తుంది.
“నా కుటుంబం తర్వాత జగనన్న కుటుంబమే ముఖ్యం. జగనన్న కోసం ప్రాణాలైనా ఇస్తాం. జగనన్న కోసం ప్రత్యర్థుల ప్రాణాలైనా తీస్తాం. నా తుది శ్వాస వరకూ జగనన్నతోనే నడుస్తా” లాంటి డైలాగ్‌లు ఇటీవల సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నాయి. ఈ డైలాగ్‌లో జగనన్న పేరు మార్చి చంద్రన్న, లోకేశ్ పేర్లు పెట్టుకుంటే…అది టీడీపీ వాళ్లు అని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ల మాయలో పడి అధినాయకులు కూడా పడి, తమ కోసం ఏదో త్యాగం చేస్తున్నారనే భావనతో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బోల్తా కొట్టించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వంలో పదవులు పొందిన వారిలో ప్రజలతో సంబంధం ఉన్న నేతలు చాలా తక్కువ కనిపిస్తారు. అంతా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో జగన్‌కు వీరవిధేయులుగా చొక్కాలు చించుకున్న వాళ్లే తప్ప, ప్రజాక్షేత్రంలో ఒక్కరోజైనా తిరిగిన వాళ్లు కనిపించరు. వీళ్లే రాష్ట్రాన్ని శాసిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి నాయకుల వల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై, అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేసే వాళ్లెవరూ ఏ మీడియాలోనూ కనిపించరు. తమ పనేదో చేసుకెళుతూ వుంటారు. మీడియాలో కనిపించని వారిని అధినేతలు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పార్టీ లేదా ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడాలంటే ప్రత్యర్థులపై బూతులు మాట్లాడాలనే నిర్ణయానికి వచ్చారు.
ఇలాంటి వాళ్లకే పనులవుతుండడంతో, అదే సరైన మార్గమని భావించి మరింత మంది పుట్టుకొస్తున్నారు. ఇందుకు పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత బాగా బూతులు మాట్లాడితే అంత మంచి లీడర్‌గా గుర్తింపు, ప్రచారం లభిస్తాయి. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న ట్రెండ్ ఇదే.