-అమరావతి భూములే చంద్రబాబు ఎన్నికల నిధులు!
– విదేశాల వైపు చూపు
– ప్రముఖుడి సాయంతో నిధుల వరద!
– వచ్చే ఎన్నికలకు ఫుల్ ప్రిపరేషన్!
తెలుగునాట ఎన్నికల ఖర్చు అనే పదాన్ని పరిచయం చేసిన నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగు రాజకీయాల్లో ఎన్నికల సమయంలో డబ్బు ప్రభావం గురించి చెప్పాలంటే… చంద్రబాబుకు ముందు, చంద్రబాబుకు తర్వాత అనే విడదీయాల్సి ఉంటుందనేది నగ్నసత్యం. తను నేతలను తయారు చేసినట్టుగా, తెలుగుదేశం పార్టీని నాయకులను తయారు చేసే కర్మాగారంగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు.
ఆయన చెప్పుకునే మాటలు అలా ఉంచితే, డబ్బున్నోడు మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయం అంటే డబ్బున్నవాడికి మాత్రమే అనే అభిప్రాయాన్ని ఏర్పరిచింది, రాజకీయాన్ని డబ్బు మయం చేసిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే! ఎంతలా అంటే.. చంద్రబాబుతో పోటీ పడాలంటే తాము ప్రజల మీద ఆధారపడటం కన్నా డబ్బు మీదే ఎక్కువగా ఆధారపడాలి అన్నట్టుగా చంద్రబాబు ప్రత్యర్థులు కూడా ఫిక్సయ్యారు. చంద్రబాబుతో పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెట్టారు, పెడుతున్నారు! ఈ పోటాపోటీ పద్ధతి ఎప్పటికప్పుడు తెలుగునాట ఎన్నికల ఖర్చు విషయంలో కొత్త హైట్స్ ను రీచ్ అవుతూ ఉంది.
ఈ అంశాన్ని మరికాస్త విశదీకరిస్తే.. 80లలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి, ముందు ఆ తర్వాత.. కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా మంది యూనివర్సిటీ రాజకీయాల నుంచి వచ్చిన వారు, లోకల్ గా పేరు పొందిన డాక్టర్లు, ప్రజల్లో పట్టు సంపాదించిన భూస్వాముల పిల్లలు, రాజకీయ నేతల వారసులు ఉంటారు. ఈ తరహాలో వెలుగులోకి వచ్చిన వారే.. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా! వర్సిటీ రాజకీయాలతో చంద్రబాబు నాయుడు వెలుగులోకి వస్తే, డాక్టర్ గా అందించిన సేవలు, లోకల్ గా ఉన్న పేరు ప్రఖ్యాతులతో వైఎస్ రాజశేఖర రెడ్డి వెలుగులోకి వచ్చారు. అంతే కానీ, వారి ఆర్థిక శక్తి వారిని రాజకీయ నేతలను చేయలేదు!
వీరు మాత్రమే కాదు.. 1975 నుంచి 1985 ల మధ్యన అనేక మంది పొలిటికల్ కెరీర్ ఆరంభించిన అనేక మంది నేతలది సాదాసీదా నేపథ్యమే. విద్యార్థి పోరాటాలు, స్టూడెంట్ యూనియన్లు, ఎన్ఎస్ యూఐ, కమ్యూనిస్టు పోరాటాలు, ఆర్ఎస్ఎస్.. ఇవే రాజకీయ ఎంట్రీకి టికెట్లు! అనామక కుటుంబ నేపథ్యం ఉన్నా.. ఇలాంటి పోరాటాల్లో మగ్గిన వారు రాజకీయాల్లోకి ఉచిత ఎంట్రీని పొందారు. అలాంటి వారు ఎంపీలయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు. హర్షకుమార్, అరుణ్ కుమార్ లతో మొదలుపెట్టి చూసినా ఇలాంటి చిట్టా పెద్దదే!
తెలుగుదేశం ఆవిర్భావంతో విద్యార్థి రాజకీయాల కన్నా.. కుల రాజకీయం ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏ ప్రాంతంలో ఏ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారంటే ఆ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వడం, ఆ కులం వారికి టికెట్లు ఇచ్చే పద్ధతిని తెలుగుదేశం తన వెంట తీసుకు వచ్చింది. దాని వల్ల రాయలసీమలో బీసీలకు టికెట్లు ఇచ్చే పద్ధతి వచ్చింది. ఇదో సానుకూలాంశమే అయినా, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు పూర్తిగా చంద్రబాబు చేతిలో పడ్డాకా, ఎన్టీఆర్ ను దించేశాకా.. మొత్తం కథ మారిపోయింది. కులానికి తోడు డబ్బు అనే అర్హతను చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టారు.
ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టుకోగలవు, పార్టీ ఫండ్ ఎంత ఇవ్వగలవు.. అనేవి చంద్రబాబు తెర వెనుక రాజకీయాలు, పార్టీ ఫండ్ బాగా ఇచ్చిన వారిని బహిరంగంగా ప్రశంసించే పద్ధతిని చంద్రబాబు నాయడు దశాబ్దాల నుంచి ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు కూడా! ఇటీవలి మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు పార్టీ ఫండ్ గురించి మాట్లాడారు. కొంతమంది నేతలు మహానాడు వేదికగా నిధిని ప్రకటిస్తున్నారని, అయితే డబ్బులు మాత్రం ఆ తర్వాత ఇవ్వడం లేదంటూ నిష్టూరమాడారంటే.. చంద్రబాబు నాయుడు లెక్కలు, ఆలోచనలు డబ్బుల చుట్టూ ఏ రేంజ్ లో తిరుగుతున్నాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు!
ఎన్నికల్లో గెలవడానికి డబ్బుకు మించిన సాధనం లేదనేది చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం అని అనేక మార్లు రుజువు అయ్యింది. రాజ్యసభ నామినేషన్లను సొంత కులంలోని పెట్టుబడి దారులకు కేటాయించడం కూడా కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వాసంలో ఉండగా కూడా ఇలాంటివే జరిగాయి. ఆ సమయంలో అనేక మంది పచ్చ చొక్కాలు ఆ తీరును ఆక్షేపించారు. అయితే వాటిని చంద్రబాబు ఎప్పుడూ లెక్క చేయలేదు!
డబ్బే గెలిపిస్తుందా?
ఈ ప్రశ్నకు అంత తేలికగా సమాధానం ఎవ్వరూ చెప్పలేరు కానీ, డబ్బే ఎన్నికల్లో గెలవడానికి ముఖ్య సాధనం అని చంద్రబాబు ఒక థియరీని తెలుగు రాజకీయాల్లో పెట్టారు. దీంతో డబ్బున్న వాళ్లు అనేకమంది తమ ట్రయల్స్ వేశారు, వేస్తున్నారు! చివరకు ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఆస్తులమ్ముకున్న వాళ్లు, అడ్రస్ కోల్పోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు! అనంతపురం జిల్లాలో ఇలాగే 2004 తర్వాత ఒక వ్యాపార వేత్త రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటికే రకరకాల వ్యాపారాల్లో వంద కోట్ల రూపాయల వరకూ ఆయన సంపాదించాడనే పేరుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా..ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని, తనకున్న ఆర్థిక శక్తితో చంద్రబాబును మెప్పించి, అనంతపురంలో చంద్రబాబు సభ పెడితే.. దాని కోసమే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, అడుగుకో స్వాగతతోరణం పెట్టించి.. అలా నాలుగేళ్ల పాటు భారీ ఖర్చులు పెట్టి, తీరా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా, అదే డబ్బునే మరింతగా ఖర్చు పెట్టినా… అంతిమంగా ఎన్నికలు కాగానే.. తిరిగిన తన దుఖాణంలో కూర్చుని ఎంత ఖర్చయిపోయిందో లెక్కబెట్టుకోవడం తప్ప మరేం చేయలేకపోయారాయన.
అదే అనంతపురం జిల్లాలో 2004 ఎన్నికల్లో ఓడిన ఒక తెలుగుదేశం అభ్యర్థి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఒక ఎంపీ తనయుడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టుకున్నాడు. అప్పుడు వైఎస్ సునామీలో తెలుగుదేశం చిత్తయ్యింది. అలా ఓడిన వారిలో ఆ ఎంపీ తనయుడు కూడా ఒకరు. ఖర్చు గురించి ఇంట్లో చర్చ జరగడం, తండ్రి మందలించడంతో.. సదరు యువనేత తుపాకీతో కాల్చుకుని మరణించారంటారు. ఎన్నికల్లో ఓటమిని అవమానంగా భావించే వారు ఉండకపోవచ్చు. అయితే ఆయన ఆత్మహత్యతో డబ్బు అంశమే ప్రధానంగా చర్చగా నిలిచింది. ఇక తమ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేకపోయినా.. చంద్రబాబును మెప్పించడానికి పార్టీ ఫండ్స్ ఇచ్చే వాళ్లు కూడా ఉంటారని అనేక దఫాల్లో రుజువయ్యింది.
సినీ నిర్మాత కూడా అయినా అప్పటి తెలుగుదేశం నేత ఒకరు.. తన సినిమా ఆడియో విడుదల వేడుకకుచంద్రబాబు పిలిచి..అక్కడే భారీ మొత్తాన్ని పార్టీ ఫండ్ గా కూడా ప్రకటించారు. అయితే ఆ తర్వాతి వారంలోనే ఆయన ఆర్థిక కష్టాలు, సినిమా కూడా దెబ్బతినడంతో… వెళ్లి హుస్సేన్ సాగర్ లో దూకారు. ఇలాంటి ఉదంతాలు.. తెలుగుదేశం పార్టీ – డబ్బు అనే అంశంలో చర్చకు నోచుకుంటాయి.
అయినా డబ్బే ప్రధానం!
చెప్పుకోవడానికి అలాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నా..డబ్బే ప్రధానంగా తెలుగుదేశం రాజకీయాలు, చంద్రబాబు వ్యూహాలు సాగుతూనే ఉంటాయి. ఇలాంటి క్రమంలో తొలి సారి చంద్రబాబు నాయుడు పెద్దగా ప్లాన్ చేసుకోకుండా వెళ్లిన ఎన్నికలు 2019వి అంటారు! ఆ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థిక విషయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రణాళికల విషయంలో ఫెయిలయ్యిందనేది ఆ పార్టీ వీరాభిమానుల మాట కూడా! 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి.. డబ్బుసరిగా ఖర్చు పెట్టకపోవడం, నిధులను సమీకరించుకోకపోవడమే ముఖ్య కారణమని వారు వాదిస్తారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు సరిగా ప్లాన్ చేసి, డబ్బులు పంచి ఉంటే.. తెలుగుదేశం పార్టీ మరీ 23 సీట్లకు పరిమితం అయ్యేది కాదనేది వారి వాదన! మరి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి చేతిలో అధికారం ఉంది. అలాంటప్పుడు నిధులకు లోటు లేనట్టే! ఇక చంద్రబాబు నాయుడు అంతకు ఐదేళ్లకు ముందు నుంచి టీడీపీ గ్రామస్థాయి కార్యకర్తలతో మొదలుపెడితే, నేతల వరకూ మంచి అవకాశాలే ఇచ్చారు. నీరు-చెట్టు వంటి ప్రోగ్రామ్ తో ప్రతి పచ్చ చొక్కా కూడా వీలైనంతగా జేబులను నింపుకుంది. ఇలా గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్తలా లక్షాధికారి అయ్యారు ఆ ఐదేళ్లలోనే.
ఇక నేతల విషయం అయితే వేరే అంచనా వేయనక్కర్లేదు. విలేజ్ లెవల్ కార్యకర్తలే లక్షాధికారులు అయ్యారంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కోట్ల రూపాయల్లో వెనుకవేయడం వేరే వివరించనక్కర్లేని అంశం! ఇక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల సొమ్ములను ప్రజల ఖాతాల్లోకి జమ వేయడం చేశారు చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాల సొమ్ములు ఎన్నికల పోలింగ్ రెండు రోజుల్లో ఉందనంగా ప్రజల ఖాతాల్లోకి వేయడం తమ విజయ రహస్యం అన్నట్టుగా తెలుగుదేశం నేతలు ప్రకటించారు. 2019 ఎన్నికల పోలింగ్ తర్వాత తెలుగుదేశం నేతలంతా ఒక చోట మీట్ అయితే.. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఇదే విషయం చెప్పారు.
పోలింగ్ కు రెండు రోజుల ముందు తాము మహిళల ఖాతాల్లోకి జమ చేసి పసుపు కుంకుమ డబ్బులు ఫలితాన్ని ఇస్తాయని, తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మరి ఫలితాలకు ముందు అలాంటి మాటలు చెప్పినా, ఫలితాల తర్వాత మాత్రం డబ్బుల పంపిణీలో తాము విఫలం అయినట్టుగా, అంటే చంద్రబాబు ఫెయిల్యూర్ అయినట్టుగా, జగన్ డబ్బులను సరిగా సమకూర్చుకుని గెలిచినట్టుగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంత కర్తల్లాంటి అభిమానులు ఇప్పటికీ చెబుతూ ఉంటారంటే ఆశ్చర్యం కలగకమానదు! వీరి లెక్కల ప్రకారం గత ఎన్నికలే కాదు, వచ్చే ఎన్నికలు కూడా నిధులు, డబ్బులు పంపకం మీదే ఆధారపడి ఉంటాయి!
మరి వచ్చే ఎన్నికలకు ఎలా?
ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారట! ఇప్పటికే భారీ ఎత్తున నిధుల సమీకరణ కూడా పూర్తయ్యిందని తెలుగుదేశం అభిమానులు ఆఫ్ ద రికార్డుగా గర్వంగా చెప్పుకుంటూ ఉండటం విశేషం. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద సరిగా దృష్టి పెట్టలేదని, దీనికి తోడు అప్పటికే ఢిల్లీకి చంద్రబాబు శత్రువు అయ్యారని, దీంతో ఎన్నికలకు సమయం దగ్గరపడ్డాకా.. నిధులు తరిలించుకోవడం కూడా సాధ్యం కాలేదని వీరు సూత్రీకరిస్తూ ఉన్నారు.
అయితే ఆ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఖర్చులకు, ఇతర పార్టీల ఖర్చులకు కూడా చంద్రబాబే సాయం చేశారనే అభిప్రాయాలూ ఉన్నాయి! మరి పక్క రాష్ట్రాలకు డబ్బులు అందించగలిగారు కానీ, సొంత రాష్ట్రంలో తరలించుకోలేకపోయారా? అనేది పెద్ద సందేహం. అదేమైనా.. వచ్చే ఎన్నికలకు మాత్రం చాలా ప్రణాళికా బద్ధంగా ప్రిపరేషన్ ఇప్పటికే మొదలైందని వినికిడి!
అమరావతి నుంచి వీలైనంతగా!
ప్రతిపక్ష వాసంలో తెలుగుదేశం పార్టీ గత మూడేళ్లుగా ఏదైనా అంశం గురించి మాట్లాడుతోందంటే అది అమరావతి గురించి మాత్రమే! అమరావతే రాజధానిగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అమరావతినే ఆశగా శ్వాసగా తీసుకుంటూ సాగుతోంది తెలుగుదేశం పార్టీ. మరి వచ్చే ఎన్నికల్లో మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశాన్ని అమరావతి ఏ మేరకు గెలిపిస్తుందో కానీ, ఎన్నికల నిధుల సాధనలో మాత్రం అమరావతే ఆయుధంగా మారుతోందని సమాచారం. అమరావతి లో భూములుగల యజమానులు వీలైనంతగా తెలుగుదేశం పార్టీకి ఇతోధిక సాయం చేయాలనేది ఇప్పటికే మౌఖికంగా వెళ్లిన ఆదేశం అని తెలుస్తోంది.
అమరాతే రాజధానిగా ఉండాలంటే, అలా జరిగి అమరావతిలో భూముల విలువలు ఇంకా ఇంకా పెరగాలంటే.. తెలుగుదేశం అధికారంలోకి రావాలి. అమరావతిలో భూముల విలువలు మరిన్ని కోట్ల రూపాయలకు చేరాలంటే దాని చుట్టూ హడావుడి జరగాలంటే చంద్రబాబు నాయుడే సీఎం కావాలి. అలా కావాలంటే.. అందుకు భారీగా డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వారాలంటే.. మళ్లీ అమరావతి వైపే చూస్తున్నారట! అమరావతిలో భూములపై పెట్టుబడులు పెట్టిన వారు, తమ భూముల ధరలు మరింతగా పెంచుకునేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టుబడి పెట్టే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఇందు కోసం ఎకరాల లెక్కన నిధుల సేకరణ జరుగుతోందని సమాచారం!
ఎకరాకు కనీసం ముప్పై వేల రూపాయలతో మొదలుపెడుతున్నారట! ఇది కనీస స్థాయి. ఆ తర్వాత అమరావతిలో వారికి ఉన్న భూముల స్థాయిని బట్టి, ఆ భూముల ధరలు పెంచుకోవాలనే కసిని బట్టి, చంద్రబాబుపై అభిమానం కొద్ది, కులంపై ఉన్న ప్రేమాభిమానాలను బట్టి, జగన్ పై ఉన్న కసి కొద్దీ డబ్బులు ఇతోధికంగా ఇవ్వాలనేది నియమంగా తెలుస్తోంది. ఈ లెక్కలన్నింటినీ బట్టి చూస్తే.. ఎకరాకు ముప్పై వేల రూపాయలతో మొదలుపెడితే.. ప్రతి ఎకరం లెక్కతోనో, ఇతర లెక్కలతోనో.. లక్ష, కోటి రూపాయలను, కోట్ల రూపాయలను ఇచ్చే వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. అమరావతి లో రియలెస్టేట్ వ్యాపారం ముప్పై వేల ఎకరాలతో ముడిపడిన అంశం అని గుర్తుంచుకోవాలి. ముప్పై వేల ఎకరాల పరిధి నుంచి.. కనీసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు జరగవచ్చని అంచనా!
ఆ రేంజ్ లో ఉంది అమరావతి భూముల వ్యవహారం. అమరావతి రాజధాని అనేది పూర్తిగా రియలెస్టేట్ ప్రయోజనాలతో ముడిపడింది అనే ప్రచారానికి ఈ వ్యవహారం మరింత ఊతం ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిధుల కోసం వెయ్యి కోట్ల రూపాయలను సమకూర్చి పెట్టే స్థాయిలో ఉంది ఈ రియల్ దందా! తమ రియల్ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పెద్ద కష్టం కాదనేది ఇక్కడి రియలెస్టేట్ వ్యాపారుల లెక్కగా తెలుస్తోంది. ఇప్పుడొక వెయ్యి కోట్ల రూపాయలను అంతా కలిసి ఇచ్చినా.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ మేరకు రియలెస్టేట్ లాభం తమకు దక్కుతుందని, అది మరింత ఎక్కువ కావొచ్చు కాబట్టి.. ఇప్పుడు టీడీపీ కోసం ఒక వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడాన్ని వారు పెద్ద భారంగా భావించడం లేదని తెలుస్తోంది.
అమరావతిని ఇలా ఆర్థిక వనరుగా మార్చుకోవడం చంద్రబాబు నాయుడు వేసిన ఒక పెద్ద ప్రణాళిక. మరి అమరావతి నుంచినే వెయ్యి కోట్ల రూపాయలు వస్తున్నాయంటే.. ఎన్నికల ఇన్వెస్ట్ మెంట్ గురించి మరీ బెంగ పెట్టుకోనక్కర్లేదేమో!
రెండో ఆదాయం.. అమెరికా నుంచి!
అమరావతి నుంచి రమారమీ వెయ్యి కోట్ల రూపాయలు వచ్చినా, ఎన్నికల ఖర్చులకు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ పెట్టాలనుకుంటున్న రేంజ్ కు ఇంకా చాలా డబ్బులే అవసరం కావొచ్చు! అందుకోసం అమెరికా వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అమెరికా పర్యటనలు పెట్టుకుంటున్నారు. అక్కడ కమ్మ కుల సంఘాల భేటీలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అక్కడ కుల సంఘం సభ్యులు గట్టిగా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక మాజీ మంత్రి, కమ్మ సంఘం ముఖ్యుడొకరు అమెరికా పర్యటనలో ఉన్నారు. మరి ఊరికే ప్రతిజ్ఞలు చేస్తే కాదు, వీలైనంతగా ఇస్తేనే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఈ నేతలు అక్కడ వివరిస్తున్న థియరీగా తెలుస్తోంది. కుల సంఘం భేటీలతో వీలైనంతగా వసూలు చేసుకుని రావడమే లక్ష్యంగా తెలుస్తోంది.
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది, ఇలాంటి సమయం నుంచినే వారిలో ఉద్రిక్తత కలిగించి, తమ కులం ఏపీలో అధికారాన్ని అందుకోవాల్సిన అవసరం గురించి వివరించి, కుల ప్రయోజనాల కోసం వీలైనంతగా ఖర్చు పెట్టుకోవాల్సిన కర్త్యవాన్ని ఉద్భోధించి, వందల కోట్ల రూపాయలను వసూళు చేసుకురావడానికి వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఒక్కో నేత పర్యటన నుంచి వంద కోట్ల రూపాయలనైనా వసూలు చేసుకురావడం వీరికి కష్టం కాబోదని సమాచారం.
చంద్రబాబును సీఎంగా చేసుకునే తమ కుల సంకల్పానికి అనుగుణంగా ఇలా వీలైనంతగా ఇవ్వగల కులస్తులు అక్కడ గట్టిగా ఉన్నారు మరి!
నిధుల వరద పారించిన ప్రముఖుడు!
తెలుగుదేశం పార్టీలో చోటామోటా నేతలు అమెరికా పర్యటనలు పెట్టుకుని నిధుల సమీకరణ చేయడం ఒక ఎత్తు అయితే, రాజ్యాంగబద్ధ హోదాలో కూడా ఒక కుల ప్రముఖుడు విదేశీ పర్యటనలతో వీలైనంత తీసుకు వచ్చారని వినికిడి. తెలుగుదేశం చోటామోటా నేతలు అడిగితే ఇవ్వడానికి వెనుకాడే వారు కొందరుంటారు. అయితే కుల ప్రఖ్యాతులకు, కుల నేపథ్యానికి నిదర్శనం అనుకున్న వ్యక్తే నిధుల వేట చేస్తే.. వచ్చే స్పందన భారీగా ఉంటుంది సహజంగానే.
ఇలాంటి నేపథ్యంలో.. ఆయన పర్యటన కూడా విజయవంతం అయ్యిందట! తాము అనుకుంటే ఎలాగైనా నిధులు తీసుకురాగలమని తెలుగుదేశం నేతలు ఈ విషయంలో గర్వంగా స్పందిస్తున్నారు. తమ వాడు ఒక పై హోదాలో ఉండి.. పార్టీ కోసం వందల కోట్లను తీసుకువచ్చాడని… అదీ తమ రేంజ్ అని వారు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధుల తరలింపు అంటే తమ సత్తాకు అది నిదర్శనమని, అది తమ కులానికే సాధ్యం అయ్యే ఫీట్ అని కూడా వారు గర్వంగా చెప్పుకుంటున్నారు.
మరి నిధులతోనే పని అవుతుందా?
ఇదైతే అంత తేలికగా బోధపడే అంశం కాదు. గత ఎన్నికల్లో ఖర్చుల విషయంలో తాము ఫెయిలయ్యి, జగన్ సక్సెస్ అయ్యే ఫలితాలు అలా వచ్చాయనే నమ్మకమే ఇప్పుడు డబ్బుల గురించే ఆరాటం ఉన్నట్టుంది. అంతే కాదు.. సొంతంగా కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్లనే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు చంద్రబాబు. మరి ఇలాంటి ప్రయత్నాలు కచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయనే సంగతెలా ఉన్నా, గెలుపుకు ఇవి కీలకమని మాత్రం టీడీపీ గట్టిగా భావిస్తోంది.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర స్థాయి సమయం ఉందనుకున్నా.. ఇప్పటికే వీలైనంతగా కూడగడుతూ తెలుగుదేశం పార్టీ డబ్బుల విషయంలో మాత్రం అన్ని అస్త్రాలనూ ఉపయోగించుకుంటున్నట్టుంది!
-వెంకట్ ఆరికట్ల