ఈమధ్య కాలంలో ఏపీ బీజేపీ నాయకురాలు, దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి హాట్ టాపిక్ గా మారారు. లోక్ సభ ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి 2024 లో జరుగుతాయి. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా ఉంటే ఈ షెడ్యూల్ లో మార్పు ఉండదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎన్నికలు దగ్గర పడుతున్నట్లే లెక్క. ఆల్రెడీ అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. కాబట్టి రాజకీయ పరిణామాలు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. వివిధ పార్టీల్లోని నాయకులకు కూడా వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ వచ్చేది రానిది ఇప్పకికే క్లారిటీ వచ్చి ఉంటుంది.
జగన్, చంద్రబాబు తమ పార్టీల నాయకులకు ఇప్పటికే టిక్కెట్ల విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీలో, ఇతర పార్టీల్లోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పరిస్థితి కూడా డోలాయమానంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో ఆమెకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే సమాచారం వస్తోంది. ప్రాధాన్యం తగ్గిస్తున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారనే విషయంలో కూడా డౌట్ ఉంటుంది కదా.
పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, గుర్తింపు ఇవ్వరని అనుమానం, టిక్కెట్ ఇస్తారో, ఇవ్వరో అనే డౌట్ అన్నీ కలిసి ఆమె కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తున్నాయి. పార్టీ ఆమెకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఆమెను ఏనాడో రాజ్యసభ ఎంపీగా (ఏదో ఒక రాష్ట్రం నుంచి) చేసి ఉండొచ్చు. ఎన్టీఆర్ కుమార్తెగా నాడు యూపీఏలో కేంద్ర మంత్రిగా (వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో) తగిన ప్రాధాన్యం లభించింది.
ఆ తరువాత బీజేపీలో చేరిన పురందేశ్వరికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ క్రమంగా ఆ గుర్తింపు తగ్గుతోంది. ఇందుకు అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అధినాయకత్వం అసంతృప్తి తో ఉన్నట్లుగా టాక్. దీని కారణంగానే గత నెలలో ఒడిషా బాధ్యతలు, తాజాగా ఛత్తీస్ ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి పార్టీ అగ్రనాయకత్వం తప్పించిందంటూ చర్చ జరుగుతోంది. పురందేశ్వరి అధ్యక్షతన ఏపిలో విస్తృత చేరికల కమిటీ ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయంలో పార్టీ ముఖ్య నాయకత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా.. బీజేపీకి మేలు జరిగే విధంగా వ్యవహరించలేకపోతున్నారని చెబుతున్నారు.
పురందేశ్వరికి గౌరవం ఇచ్చినా.. పార్టీ అప్పగించిన చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదనేది కమలం సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. అంతేకాదు ఆమె చంద్రబాబు నాయుడుకు దగ్గర అవుతున్నారనే ప్రచారం కూడా జోరుగానే ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కుటుంబం టీడీపీలో చేరడం ఖాయమంటున్నారు. ఒకవేళ ఆమె నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరకపోయినా..? తన కుమారుడ్ని టీడీపీలో జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ.. గుడివాడ కొడాలి నానిని ఓడించాలనే కంకణం కట్టుకుంది. కాని అక్కడ సరైన అభ్యర్థి దొరకడం లేదు. అయితే కొడాలి నానిని ఎదిరించాలి అంటే.. నందమూరి కుటుంబానికి చెందిన వారైతే.. గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని.. స్థానికంగా ఉన్న ఆ సామాజిక వర్గాల ఓట్లు కూడా నానికి వ్యతిరేకంగా పడతాయని లెక్కలు వేస్తున్నారు.
ఇటీవల కొడాలి నాని లోకేష్ తల్లిని అవమానించేలా మాట్లాడారు అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఈ సారి ఎలాగైనా కొడాలిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. నేరుగా తన సోదరిపై వ్యాఖ్యలు చేయడం పురందేశ్వరికి సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఆమె గుడివాడలో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సొంత సోదరిని అనడం ఇటు పురందేశ్వరికి కోపం తెప్పించే అంశమే.. దానికి తోడు.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు నాయుడికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే.. పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.
అందుకే శత్రువులును కూడా ఆయన దగ్గర చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా దగ్గుబాటి కుంటుంబానికి సన్నిహితంగానే ఉంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఓ కుటుంబ కార్యక్రమంలో కలుసుకొని సన్నిహితంగా మాట్లాడుకున్నారు కూడా. వెంకటేశ్వరరావు అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరినప్పుడు చంద్రబాబు పలకరించి మాట్లాడారు.
ఇలాంటి పరిణామాలన్నీ రెండు కుటుంబాలు సన్నిహితం కావడానికి దోహదం చేశాయని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.