వంగలపూడి అనిత… తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు. తన అందచందాలు, మాటకారితనంతో ఆకట్టుకున్న టీడీపీ మహిళా నాయకురాలు. ఇటీవల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై దూకుడు ప్రదర్శించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి కూడా వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు. గోరంట్ల వీడియో చుట్టూ ప్రదక్షిణ చేసిన అనిత… కీలక సమయంలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నానిపై టీడీపీ నేతలు కూడా అదేస్థాయిలో బూతుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, ఏకంగా నాని ఇంటిని ముట్టడించడానికి టీడీపీ ముఖ్య నేతలు కదిలారు. అదేంటో గానీ వీరిలో అనిత మాత్రం లేకపోవడం చర్చకు దారి తీసింది. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నెట్టెం రఘురాం, కాగిత కృష్ణప్రసాద్, వర్లకుమార్ రాజా తదితరులు నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నానికి ఆయన భాషలోనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ నాయకుడి కుటుంబ సభ్యుల్ని తిడ్తావా? నీ అంతు చూస్తా మంటూ గుడివాడకు వెళ్లే డ్రామాకు తెరలేపారు. మాధవ్ వీడియోపై విపరీతమైన ఆసక్తి కనబరిచిన అనిత, ఇప్పుడు బాస్‌లపై అంతలా నాని దూషణలకు దిగితే మాత్రం పత్తా లేకుండా పోయారు. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తనను పట్టించు కోలేదన్న ఆవేదనతో ఆమె ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన భార్య భారతిలతో పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ బాస్‌ల దృష్టిలో పడి లబ్ధి పొందాలని అనిత ఆశించారు. కానీ అనిత అశించినట్టు ఏదీ జరగలేదని సమాచారం. చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర దూషణలకు దిగినా అనిత స్పందించకపోవడానికి కారణం అసంతృప్తా? లేక మరేదైనా కారణమా? అనే చర్చ నడుస్తోంది.