ఫిల్మ్ నగర్ క్లబ్ గడబిడ షురూ

టాలీవుడ్ లో ఎన్నికలు అన్నది ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో జరుగుతూనే వుంటాయి. 24 క్రాఫ్ట్ లు, వాటి యూనియన్ల ఎన్నికలైతే చాలా హడావుడి వుంటుంది. మా ఎన్నికల హడావుడి అందరికీ తెలిసిందే.…

టాలీవుడ్ లో ఎన్నికలు అన్నది ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో జరుగుతూనే వుంటాయి. 24 క్రాఫ్ట్ లు, వాటి యూనియన్ల ఎన్నికలైతే చాలా హడావుడి వుంటుంది. మా ఎన్నికల హడావుడి అందరికీ తెలిసిందే. ఏదో జనరల్ ఎన్నికలు అన్నంత గడబిడ జరిగింది. నిత్యం మీడియా మీట్ లు, ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడాలు అన్నీ జరిగాయి.

కౌన్సిల్, చాంబర్ ఎన్నికలు మాత్రం చాలా స్మూత్ గా సజావుగా జరిగిపోతాయి. అక్కడ తెరవెనుక చక్రం తిప్పే పెద్దలు వుంటారు. వారి వారి మనుషులు తెరపైకి వస్తారు. ఏనాడో జమానా కాలం నాడు సినిమాలు తీసిన వారు పదవుల్లో కుదురుకుంటారు. తెరవెనుక నుంచి పెద్దలు ఆడిస్తుంటారు. ఇదంతా వేరే సంగతి.

ఇప్పుడు లేటెస్ట్ గా ఎఫ్ఎన్ సి సి ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ అనే సంస్థ వుంది. దానికి ఫిలింనగర్ లో ఫ్రభుత్వం కేటాయించిన స్థలం వుంది. అందులో నిర్మించుకున్న భవనాలు వున్నాయి. దీంట్లో దాదాపు 4400 మందికి పైగా సభ్యులు వున్నారు. సామాన్యులు ఎవ్వరూ ఇందులో సభ్యులు కాలేరు. ఎందుకంటే జీవిత సభ్యత్వం కావాలంటే ఏకంగా 16 లక్షలకు పైగా చెల్లించాల్సి వుంటుంది.

డివిఎస్ రాజు టైమ్ లో ఎన్టీఆర్ సహకారంతో ఏర్పాటైన క్లబ్ ఇది. మొదట్లో కేవలం ఫిలిం నగర్ లో ప్లాట్లు పొందిన వారి కోసమే అన్నట్లు ఏర్పాటైంది. కానీ కేవలం ప్లాట్ ఓనర్లకు మాత్రమే కాకుండా, వారి పిల్లలకు కూడా సభ్యత్వాలు ఇచ్చేసారు. తరువాత రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ జనాలు కూడా వచ్చి చేరారు. దీంతో తమ హవా సాగదు అని అర్థం అయిన క్లబ్ నాయకత్వం 2008 తరువాత నుంచి సభ్యత్వాలు ఇచ్చిన వారి దగ్గర నుంచి అఫిడవిట్ లు తీసుకోవడం మొదలుపెట్టింది. ఓటు హక్కు అడగము అని అఫిడవిట్ ఇస్తేనే సభ్యత్వం ఇస్తారన్నమాట.

ఎంత తెలివో చూడండి.. లక్షలకు లక్షలు సభ్యత్వం చెల్లించి క్లబ్ ఆర్థికంగా పరిపుష్టం కావడానికి దోహదపడాలి. కానీ క్లబ్ మాత్రం కొందరి చేతుల్లోనే వుండాలి. ఇప్పుడు ఏమయింది అంటే ఓటింగ్ వున్న వారు 2500… ఓట్లు లేని సభ్యులు 2000 మంది. మరి ఇది ప్రజాస్వామ్య ఎలా అవుతుంది? ఏమన్నా అంటే బైలాస్..అఫిడవిట్ లు అంటూ నిబంధనలు బయటకు వస్తాయి. అందరికీ ఓటింగ్ ఇస్తే, క్లబ్ మీద ఆధిపత్యం పోతుందని ఓ సామాజిక వర్గం భయపడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు క్లబ్ ఆధిపత్యం అంతా ఒకే సామాజిక వర్గం చేతిలో వుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఫిలింనగర్ క్లబ్ వ్యవహారాలు సరిగ్గా లేవు అంటూ గతంలోనే కోర్టులో కేసు పడి వుంది. ప్రసన్న కుమార్ వేసిన ఆ కేసు ఇంకా విచారణ దశలోనే వుంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. తమకు ఓటు హక్కు ఇవ్వాల్సిందే. బైలా మార్చాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గడబిడ కూడా మొదలయింది.

క్లబ్ పై ఆధిపత్యం చేజారిపోనివ్వకూడదని పావులు కదపడం మొదలైంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఆదిశేషగిరి రావునే మళ్లీ పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు. కానీ దగ్గుబాటి సురేష్ బాబు కూడా రంగంలోకి దిగారు. అయితే పెద్దలు కూర్చుని సురేష్ బాబుకు వచ్చేసారి అవకాశం ఇవ్వడానికి, ఈసారి కూడా ఆదిశేషగిరి రావు నే రంగంలోకి దింపడానికి ఒప్పించారు. ముళ్లపూడి మోహన్ ను ప్రధాన కార్యదర్శిగా పోటీకి దింపుతారు. ప్రస్తుతం కార్యదర్శిగా వున్న కేఎస్ రామారావు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

ఇప్పుడు కొద్ది పాటి గొంతులు లేస్తున్నాయి. అందరికీ ఓటింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కులాల, ప్రాంతాల వ్యవహారాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం…నాన్ కమ్మ వర్గం…ఆంధ్ర..తెలంగాణ ఇలా రకరకాల ఈక్వేషన్లు వినిపిస్తున్నాయి. ఇవి మరింత పెరుగుతాయా? ఓట్లు లేనందున సద్దుమణుగుతాయా? అన్నది చూడాలి.