ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నందుకు ఎంతో బాధపడుతున్నట్టు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ప్రత్యర్థులకు బదులుగా శత్రు భావనతో పరస్పరం దూషించుకుంటున్నారన్నారు. రాజకీయాలను 2019కి ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోవాల్సి వుందన్నారు.
అనిత మీడియాతో మాట్లాడుతూ గతంలో రాజకీయాల్లో విమర్శలు హుందాగా వుండేవన్నారు. పరస్పరం సెటైర్స్ వేసుకునే వాళ్లన్నారు. విమర్శనాస్త్రాలు సంధించుకునే వాళ్లన్నారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో అక్క, అమ్మ, చెల్లి అంటూ తిడుతున్నారన్నారు. ప్రస్తుతం డైవర్ట్ రాజకీయాలు సాగుతున్నాయన్నారు. దీనంతటికి ముఖ్యమంత్రి వైఎస్ జగనే కారణమని ఆమె చెప్పుకొచ్చారు.
ఏదైనా సమస్య వస్తే… దాని నుంచి తప్పించుకోడానికి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇందులోకి ఆడవాళ్లను లాగుతున్నారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ జీవిత భాగస్వామిని ఎందుకు ఇన్వాల్స్ చేశావని ప్రశ్నించామని ప్రశ్నిస్తే… సమాధానం చెప్పలేక కుటుంబ సభ్యుల్ని తిట్టిస్తున్నారన్నారు.
జగన్ వద్ద మార్కులు పొందేందుకు హోదాలను మరిచి తమను ఇష్టమొచ్చిన తిట్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపడం తమ బాధ్యతన్నారు. తాము అదే చేస్తున్నామన్నారు. అమ్మతనాన్ని కూడా కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. తాము కూడా మాట్లాడలగమన్నారు. కానీ సంస్కారం అడ్డొస్తోందన్నారు.
కొడాలి నానిని కనింది ఒక తల్లి అని, ఆమెపై గౌరవంతో తిట్టడం లేదన్నారు. ఇప్పటికీ కొడాలి నాని గారు అని మాట్లాడుతు న్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆడవాళ్లను మాట్లాడ్డం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే లోకేశ్, చంద్రబాబుతో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.