శ్రీవారి భక్తులకు టీటీడీ మరింతగా దర్శన భాగ్యం కల్పించింది. ఈ మేరకు టీటీడీ చర్యలు తీసుకుంది. కలియుగ దైవం శ్రీవేంక టేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు భావిస్తాడు. అయితే కరోనా మహమ్మారి పుణ్యమా అని ఏడుకొండల స్వామి దర్శనం కష్టమైంది.
కరోనా సెకెండ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని టీటీడీ మార్చి నుంచి దర్శనానికి సంబంధించి గణనీయంగా తగ్గించింది. ఈ నాలుగు నెలలు కేవలం 5 వేలు టికెట్లు మాత్రమే కేటాయించింది.
మరోవైపు ఉచిత దర్శనాన్ని రద్దు చేయడంతో స్వామిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు నిరాశ తప్పలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో బుధవారం నుంచి రోజుకు 3 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 30 వరకు రోజూ మూడు వేలు టికెట్లు పెంచడంతో దాదాపు లక్షా పది వేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.
అయితే సాంకేతిక సమస్యతో బుధవారం ఉదయం 11 గంటలకు అన్లైన్లో ఈ టికెట్లు రాలేదు. అనంతరం టీటీడీ అధికారులు సమస్యను పరిష్కరించారు. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
టికెట్లు విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే మాయమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో తిరుమల వచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపడంతో టీటీడీ కూడా వారి మనోభావాలకు తగినట్టు వ్యవహరిస్తోంది.