కొలిక్కిరాని డిప్యూటీ క‌స‌ర‌త్తు

రెండో డిప్యూటీ మేయ‌ర్/వైస్ చైర్మ‌న్ల‌ ఎంపిక‌కు సంబంధించి వైసీపీ ప్ర‌భుత్వ క‌స‌ర‌త్తు ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యంగా సామాజిక స‌మీక‌ర‌ణ‌లకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా…

రెండో డిప్యూటీ మేయ‌ర్/వైస్ చైర్మ‌న్ల‌ ఎంపిక‌కు సంబంధించి వైసీపీ ప్ర‌భుత్వ క‌స‌ర‌త్తు ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యంగా సామాజిక స‌మీక‌ర‌ణ‌లకు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న రెండో డిప్యూటీ మేయ‌ర్ లేదా వైస్ చైర్మ‌న్ ఎంపిక‌కు సంబంధించి ఎస్ఈసీ నోటిఫికేష‌న్ ఇచ్చింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇద్ద‌రు డిప్యూటీల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింది.  

ఇప్ప‌టికే మేయ‌ర్లు, చైర్మ‌న్లు, డిప్యూటీ మేయ‌ర్/ వైస్ చైర్మ‌న్ల ఎంపిక‌లో పూర్తిగా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌పై జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. రిజ‌ర్వేష‌న్‌కు మించి మ‌హిళ‌లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు జ‌గ‌న్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. 

ఈ నేప‌థ్యంలో అగ్ర‌వ‌ర్ణాల‌కు అన్యాయం జ‌రిగింద‌నే భావ‌న రాకుండా రెండో డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని తెర‌పైకి తెచ్చార‌నే వాద‌న ముందుకొచ్చింది. అయితే ప్ర‌స్తుతం వైసీపీ క‌స‌ర‌త్తు చూస్తుంటే అలాంటిదేమీ లేద‌ని ముఖ్య నేత‌లు చెబుతున్నారు. మ‌రోసారి కులాల‌కు పెద్ద‌పీఠ వేసేందుకు జ‌గ‌న్ నిశ్చ‌యించార‌ని తెలిసింది.

ఇందులో భాగంగా తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లోని కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల్లోని రెండో డిప్యూటీ ఎంపిక ఇంకా కొలిక్కి రాలేద‌ని స‌మాచారం. ఈ రెండు మిన‌హా మిగిలిన జిల్లాల్లోని ప‌ద‌వుల‌కు సంబంధించి క్లారిటీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు రాయ‌ల‌సీమ‌లోని తాడిప‌త్రి మిన‌హాయించి మిగిలిన అన్ని ప‌ట్ట‌ణ పాల‌క వ‌ర్గాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. 

అయిన‌ప్ప‌టికీ నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌మ అభ్య‌ర్థుల‌తో సంత‌కాలు చేయించుకోవ‌డం, విప్‌జారీ త‌దిత‌ర ప‌నులు పూర్తి చేసేందుకు స‌మ‌యం లేద‌ని అధికార పార్టీ నేత‌లు వాపోతున్నారు. వీలైనంత త్వ‌ర‌గా క‌స‌ర‌త్తు పూర్తి చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.