తొలిసారి ఆ ఆలయం గురించి విన్నదెపుడు?

రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినివై… కనులముందు నీవుంటే కవిత పొంగిపారదా…తొలి చిగురులు చూడగానే కలకోకిల కూయదా అంటూనాయికను ఉద్దేశించి పాడిన పాటలో.సినారె సినీ గీతం అది. నిజంగా అంత అందంగా ఉంటుందా…

రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినివై… కనులముందు నీవుంటే కవిత పొంగిపారదా…తొలి చిగురులు చూడగానే కలకోకిల కూయదా అంటూనాయికను ఉద్దేశించి పాడిన పాటలో.సినారె సినీ గీతం అది. నిజంగా అంత అందంగా ఉంటుందా ఆలయం? ఆ శిల్పాలు అనే సందేహం.

ఏ హైదరాబాద్, మైసూర్ లాంటి ప్రదేశాలకు స్కూల్లో విహారయాత్రలుంటాయి కానీ రామప్పలాంటి సుదూర ప్రాంతాలకు ఉండవు కదా…ఈలోగా 1984-85 ల్లో రామప్ప ఆలయం మరొకసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. కారణం…ఆలయ కుడ్యాలపై ఉన్న భంగిమల ఆధారంగా నటరాజ రామకృష్ణ గారు నాటి కాకతీయుల జాయపసేనాని నృత్యరత్నావళి లోని పేరిణీ శివతాండవాన్ని పునరుద్దరించారు.

ఆ ఏడు శివరాత్రి రోజున రామప్ప ఆలాయంలో లక్షదీపార్చన, తన శిష్యులతో తొలిసారి పేరిణీ శివతాండవం ప్రదర్శన ఇప్పించారు. ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.అంతకుముందు చరిత్ర పట్ల మక్కువ ఉన్న జనాలు పాలంపేటకు ఒకటీ అరా ఉన్న బస్సుల్లో, సొంత వాహనాల్లో పోయేవారు. ఈ శివరాత్రికి రాష్ట్రం నలుమూలల వేలాదిగా జనం ఆ ప్రదర్శనను,ఆలయాన్ని దర్శించారు. 

ఇప్పుడు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించడం సంతోషదాయకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఆ గౌరవం దక్కించుకున్న తొలి కట్టడం ఇది. పుంఖానుపుంఖాలుగా మొన్నటి నుంచి వ్యాసాలు చూస్తున్నా ఎందుకో అందరూ పేరిణీ శివతాండవ భంగిమలను మరచారని అనిపిస్తుంది. అప్పట్లో వరంగల్ పోయిన యాత్రికులు ఓరుగల్లు కోట, రామప్ప ఆలయంతో పాటూ పాకాల చెరువునూ చూసివచ్చేవారు.

ఇటీవల కాలంలో లక్నవరం చెరువులో సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత అక్కడికి పర్యాటకుల సందడి ఎక్కువైంది, పాకాల ప్రాభవం తగ్గినట్లు అనిపిస్తుంది. ఏదైనా పర్యాటక ప్రదేశాలను అభివృద్ది చేస్తే వీక్షకుల సందడి పెరగడం,టూరిజం ఆదాయం పెరుగుతాయి. జనానికి మానసికోల్లాసం తో పాటూ ఒక ప్రాంతం గురించి అవగాహనా పెరుగుతుంది.

రామప్ప ఆలయంతో పాటూ తెలంగాణాలో అలంపురం ఆలయ సముదాయాన్నీ యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించాలనే కోరిక చిరకాలంగా ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి అపురూప కట్టడాలు లేవా అంటే ఎందుకు లేవూ!!!ఉదాహరణకు రాయలసీమనే తీసుకుంటే…

రేణిగుంటకు సమీపంలో ఉన్న గుడిమల్లం పరుశురామేశ్వరాలయం చరిత్రకు అందిన తొలి ఆలయం. బౌద్ధ చైత్యాన్ని పోలిన గర్భాలయం, పురుషాంగం ఆకారంలోని శివలింగం దీని ప్రత్యేకత. ఇంతకన్నా ప్రాచీన ఆలయం చరిత్ర పరిశోధకులకు ఇంతవరకూ దొరకనందున దేశంలోని అతి ప్రాచీనాలయంగా దీన్ని వారసత్వ కట్టడంగా గుర్తించే ఏర్పాటు చేయవచ్చును.

ఇక అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం..ఒక చిన్న గుట్టమీద నిర్మించిన ఆలయం అద్భుత శిల్పకళకు కాణాచి. అంతేకాదు ఆలయ పైకప్పు మీద సహజసిద్ధమైన రంగులతో చిత్రీకరించిన వర్ణ చిత్రాలు మరో ఆకర్షణ. పురాణ గాధలే కాకుండా నాటి ఆహార్యాన్ని చూడవచ్చును.

ఇక ఏ ఆలయమైనా పైకప్పు పెద్ద గ్రానైట్ దూలాలతో కప్పుతారు. ఆ పైన గార(మోర్టార్) తో కప్పుతారు. ఇప్పటిలా కాంక్రీట్ ఉంటే కప్పు నుంచి కిందవరకూ ఒక ఆర్సీసీ పిల్లర్ ఒక వింతగా పెట్ట వచ్చు. కానీ ఈ ఆలయంలో కప్పు నుంచి వేలాడే అంటే నేలను ఆధారం చేసుకోని రాతి స్తంభం ఉంది. ఆధారం లేని స్థంభం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. ఇక ఆలయానికి కొద్ది దూరంలో ఏకశిల ను బసవయ్యగా మార్చిన శిల్పుల పనితనం అబ్బురపరుస్తుంది.

ఇక ఇదే జిల్లాలోని తాడిపత్రి లోని బుగ్గరామలింగేశ్వర, చింతల వెంకటరమణ ఆలయ శిల్పాలు అత్యద్భుతం. ఇక కర్నూలు జిల్లాలోని బెలుంగుహలు..అన్నికాలాల్లో కోనేటిలో ఒకే నీటిమట్టం ఉండేలా, ప్రవహించే నీటిబుగ్గ ఉన్న మహానంది ఆలయం(దీని గర్భాలయం చాళుక్య శైలిలో ఉంటుంది) కడప జిల్లాలో పెన్నా నదికి ఇరువైపులా ఆలయాలున్న పుష్పగిరి(ఇక్కడ లక్నవరం తరగా బ్రిడ్జ్ వస్తుందని వైయస్సార్ కాలం నుంచీ అంటూనే ఉన్నారు)గ్రేట్ ఇండియన్ కానియన్ లా పేరొందిన గండికోట లాంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుకు ఎంతో లాబీయింగ్ చేయాలి. అది లేకపోయినా ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు మృగ్యం. పర్యాటక శాఖ ఈ విషయంగా ఆలోచించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు రాయలసీమ జనం.