ఈ కన్ఫ్యూజన్ ఏంటి ముఖ్యమంత్రి సారూ..!

ఏపీ బడ్జెట్ అన్ని వర్గాలకు ఆనందాన్నివ్వగా రేషన్ డీలర్ల ఆందోళనను మాత్రం మరింత పెంచింది. రేషన్ డీలర్ల వ్యవస్థను త్రిశంకు స్వర్గంలో ఉంచింది బడ్జెట్. కలల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పౌర…

ఏపీ బడ్జెట్ అన్ని వర్గాలకు ఆనందాన్నివ్వగా రేషన్ డీలర్ల ఆందోళనను మాత్రం మరింత పెంచింది. రేషన్ డీలర్ల వ్యవస్థను త్రిశంకు స్వర్గంలో ఉంచింది బడ్జెట్. కలల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పౌర సరఫరాల వ్యవస్థలో లోపాల్ని సరిదిద్దేందుకు రేషన్ సరకుల డోర్ డెలివరీ సిస్టమ్ ప్రవేశ పెడతామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా 3750 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నాణ్యమైన సరుకులను ప్రజలకు అందిస్తామన్నారు బుగ్గన. అయితే ఇక్కడ రేషన్ డీలర్ల గురించి మంత్రి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన చేస్తున్నారు. ఇంటింటికీ గ్రామ వాలంటీర్లతో రేషన్ సరకులు పంపిణీ చేస్తే ఇక డీలర్లతో పనేంటి. స్టాక్ పాయింట్ల ద్వారా నేరుగా ప్యాకింగ్ చేసి సరకులు పంపిణీ చేస్తే మధ్యలో రేషన్ డీలర్లు ఉపాధి కోల్పోతారంటూ ఆందోళనలు చెలరేగాయి.

కొన్నిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నా మంత్రులు సర్దిచెబుతూ వచ్చారు. రేషన్ డీలర్ల ఉపాధికి ఇబ్బంది లేకుండా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే వారి అపోహలు మాత్రం తొలగలేదు. దీనికి బలం చేకూరుస్తూ ఆర్థికమంత్రి బుగ్గన ప్రసంగం ఉంది. రేషన్ సరకుల పంపిణీ గురించి చెప్పారు కానీ, రేషన్ డీలర్ల సంగతి ప్రస్తావించలేదు.

రేషన్ సరకుల్ని ఇంటికి నేరుగా వాలంటీర్లు తెచ్చి ఇస్తారు అని స్పష్టం చేశారంటే.. డీలర్లు ఇక ఉండరనే అర్థం చేసుకోవాలి. మరి డీలర్ వ్యవస్థ రద్దుచేస్తే వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతామంటూ రోడ్డెక్కుతాయి. ఈ సంక్లిష్ట సమస్యను సీఎం జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

డీలర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తారా, లేక స్టాక్ పాయింట్లకు, వాలంటీర్లకు మధ్య వారధిగా ఉండి సరకుల పంపిణీ పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారా..? వేచిచూడాలి. 

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!