వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉంటుందా అని అన్నివర్గాలు ఆశగా ఎదురుచూశాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు బడ్జెట్ కేటాయింపులు ఎలా చేస్తారా అంటూ ఆసక్తితో చూశాయి. అందరి నమ్మకాలను నిలబెడుతూ నవరత్నాలకు అధిక కేటాయింపులు చేస్తూ జగన్ తొలి పద్దు బయటకు వచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఇది నవరత్నాల బడ్జెట్ అంటూ కితాబిచ్చారు.
జగన్ మానస పుత్రిక అయిన నవరత్నాల పథకానికి అధిక కేటాయింపులు జరిగాయి. వైఎస్సార్ పెన్షన్ కానుకకు ఏకంగా రూ. 18,000 కోట్లు కేటాయించారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులగు నెలవారీ పింఛన్ సొమ్ము పెంచడంతో బడ్జెట్ కేటాయింపులు కూడా అనివార్యంగా పెరిగాయి. ఏపీని రైతు రాజ్యం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు కేటాయించారు.
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తామంటూ ఐదేళ్లు కాలయాపన చేసిన టీడీపీ సర్కారు కళ్లు తెరిపించేలా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే వారికి సబ్సిడీ ఇచ్చారు జగన్. కేవలం ఆక్వా రైతుల కోసమే 475 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక మెట్ట ప్రాంత రైతుల కోసం తొలిసారిగా ఉచిత బోర్ల పథకం ప్రవేశ పెట్టిన జగన్ సర్కారు ఇందుకోసం రూ. 200 కోట్లు కేటాయించింది.
నవరత్నాల్లో ముఖ్యమైన అమ్మఒడి పథకానికి 6,445 కోట్లు కేటాయించారు. అమ్మఒడి వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు కానుంది. దీంతో ఈ బడ్జెట్ లోనే దీనికి కేటాయింపులు పూర్తి చేశారు. ఇక ఆరోగ్యశ్రీని మెరుగుపరచి నిధులు కూడా ఎక్కువగా మంజూరు చేశారు. ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయించారు. వీటితో పాటు గ్రామాల్లో పాలన రూపు రేఖలను మార్చేందుకు గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను నవరత్నాలలో భాగంగా ప్రవేశ పెట్టారు జగన్. దీనికోసం కూడా భారీగా కేటాయింపులు జరిగాయి.
గ్రామ వాలంటీర్ల వ్యవస్థకోసం రూ. 720 కోట్లు, గ్రామ సచివాలయ నిర్వహణకు రూ.700 కోట్లు, మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ.280 కోట్లు, మున్సిపల్ సచివాలయాలకు రూ.180 కోట్లు, సబ్సిడీ బియ్యం పథకానికి రూ.3వేల కోట్లు ఏపీ పౌరసరఫరాలకు సాయం కింద రూ.384 కోట్లు కేటాయించారు. మొత్తం 2,27,984 కోట్ల భారీ బడ్జెట్ లో నవరత్నాలకు అధికభాగం కేటాయింపులు జరిగాయి.