ఆ ఒక్క పని చేస్తే జగన్ రైతు బాంధవుడే

కౌలు రైతులు అసలు రైతులే కాదన్నట్టు చూస్తుంటాయి బ్యాంకులు. రుణాలైనా, ఇతర పథకాలైనా అన్నిటికీ పట్టాదార్ పాస్ పుస్తకాలే అర్హతగా పరిగణిస్తుంటాయి. ఆ లెక్కన కౌలు రైతు దగ్గర ఎలాంటి పత్రాలూ ఉండవు. అందుకే…

కౌలు రైతులు అసలు రైతులే కాదన్నట్టు చూస్తుంటాయి బ్యాంకులు. రుణాలైనా, ఇతర పథకాలైనా అన్నిటికీ పట్టాదార్ పాస్ పుస్తకాలే అర్హతగా పరిగణిస్తుంటాయి. ఆ లెక్కన కౌలు రైతు దగ్గర ఎలాంటి పత్రాలూ ఉండవు. అందుకే భూ యజమానులే రైతులకు రావాల్సిన అన్ని సౌకర్యాలూ పొందుతుంటారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం కూడా కౌలురైతుల కష్టాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. చట్టాలు ఏం చెప్పినా గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు మాత్రం మారలేదు.

తాజాగా జగన్ సర్కారు కౌలు రైతుల కష్టాలు తీర్చడానికి కొత్త విధానం ప్రవేశపెట్టింది. కౌలు ఒప్పందాన్ని 11 నెలలకు పరిమితం చేస్తూ.. ఒప్పంద పత్రమే బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు అర్హత కార్డుగా ఉపయోగించుకునేలా ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభమైనదేం కాదు. ఒప్పంద పత్రాలు రాసుకోవాలంటే భూ యజమానులు ససేమిరా అంటారు.

యజమానులు దూర ప్రాంతాల్లో ఉంటూ.. కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్న సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ఒప్పంద పత్రాలు రెవెన్యూ అధికారులు అందజేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఇలాంటి ఒప్పంద పత్రాలను బ్యాంకులు లెక్కలోకి తీసుకునేవి కావు. అప్పటికే భూ యజమానులు పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటుంటారు. ఇలా తీసుకున్న రుణాలతో వారు వ్యవసాయం చేయరు, ఇటు వ్యవసాయం చేసే కౌలు రైతుకి బ్యాంకులు రుణాలు ఇవ్వవు.

ఇలాంటి విచిత్ర పరిస్థితుల వల్లే రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. పంట సాగు చేసేవాడికి బ్యాంకులు రుణాలివ్వవు, రుణాలు తీసుకున్నవారు సాగు చేయరు. ఈ పరిస్థితి మార్చాలంటే ప్రత్యామ్నాయం కావాల్సిందే. ఈ దిశగానే జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. కౌలు ఒప్పందాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులు నిజమైన రైతులకు న్యాయం చేసేవిగా ఉంటే కచ్చితంగా జగన్ రైతు బాంధవుడిగా చరిత్రలో నిలిచిపోతారు.

జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా, అమలులో అది విఫలమైతే మాత్రం దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్టు అయిపోతుంది కౌలు రైతుల పరిస్థితి. ఏదేమైనా రైతుల కష్టాలు తొలగించడానికి జగన్ చేస్తున్న కసరత్తు మాత్రం గొప్పది. ఈరోజు ప్రవేశపెట్టనున్న వ్యవసాయ బడ్జెట్ లో ఈ దిశగా కీలక ప్రకటన ఏదైనా వస్తుందేమో చూడాలి.

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!