వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య తేడా!

క‌డ‌ప‌లో ఓ సామెత‌… పాలిచ్చే ఎనుము అమ్ముకుని, త‌న్నేగాడిద‌ను తెచ్చుకున్నార‌ని. ఈ సామెత చందాన‌ వైఎస్ జ‌గ‌న్ రెండో ద‌ఫా కేబినెట్ కూర్పు వుంది. పోనీ కేబినెట్ మొత్తాన్ని ప్ర‌క్షాళ‌న చేశారా? అంటే అదీ…

క‌డ‌ప‌లో ఓ సామెత‌… పాలిచ్చే ఎనుము అమ్ముకుని, త‌న్నేగాడిద‌ను తెచ్చుకున్నార‌ని. ఈ సామెత చందాన‌ వైఎస్ జ‌గ‌న్ రెండో ద‌ఫా కేబినెట్ కూర్పు వుంది. పోనీ కేబినెట్ మొత్తాన్ని ప్ర‌క్షాళ‌న చేశారా? అంటే అదీ లేదు. ఏవో సామాజిక స‌మీక‌ర‌ణ‌లంటూ లెక్క‌లేసుకుని కేబినెట్‌-2 ఏర్పాటును “మ‌మ” అనిపించారు. ఇప్పుడాయ‌న త‌న కోసం గ‌ట్టిగా మాట్లాడాల‌ని మంత్రుల‌ను ఆదేశించాల్సిన‌ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక‌వేళ ఎవ‌రైనా మంత్రులు దుష్ట‌చ‌తుష్ట‌యంపై గ‌ట్టిగా విమ‌ర్శ‌లు చేయ‌క‌పోతే మార్చేస్తాన‌ని హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇందులో నిజానిజాలేంటో మంత్రుల‌కు మాత్ర‌మే తెలుసు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కేబినెట్ స‌మావేశంలో మాట్లాడిన అంశాల‌పై నాణేనికి రెండో వైపు జ‌రుగుతున్న చ‌ర్చ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వుంది. ఎంత సేపూ త‌న‌కు అంద‌రూ మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాల‌ని కోర‌డ‌మే త‌ప్ప‌, ఆయ‌న చేస్తున్న‌దేంటి? అనే ప్ర‌శ్న తెర‌పైకి వ‌చ్చింది. జ‌గ‌న్ కోసం ప్రాణాలు అర్పించ‌డానికైనా సిద్ధ‌మైన మాజీ మంత్రి కొడాలి నాని విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ముమ్మాటికీ త‌ప్పు అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే వైఎస్ జ‌గ‌న్ స్థానంలో ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వుంటే కొడాలిని విడిచి పెట్టుకునే వారా? అనే ప్ర‌శ్న బ‌లంగా వినిపిస్తోంది.

గ‌తంలో జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు మంత్రిగా ఉన్న‌ప్పుడు అనారోగ్యానికి గుర‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను కేబినెట్ నుంచి తొల‌గించ‌ని వైనాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. త‌న మిత్రుడు జ‌క్కంపూడిని చివ‌రి శ్వాస‌ వ‌ర‌కూ మంత్రిగా చూశార‌ని గుర్తు చేస్తున్నారు. త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల విష‌యంలో వైఎస్సార్ క‌న‌బ‌రిచే ప్రేమ అలాంటిద‌ని ప్ర‌త్య‌ర్థులు కూడా చెబుతున్నారు. ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే… అంద‌రూ త‌న కోస‌మే త‌ప్ప‌, తాను మాత్రం ఇత‌రుల కోసం లేన‌నే సంకేతాల్ని ఆచ‌ర‌ణ ద్వారా ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కేబినెట్ నుంచి కొడాలి నానీని ఎందుకు త‌ప్పించారో, అస‌లు ఆయ‌న మ‌న‌సులో ఏముందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేద‌ని అంటున్నారు. ఇదే జ‌గ‌న్ కోసం కొడాలి చివ‌రికి ప్రాణాల‌కు కూడా తెగించి టీడీపీతో ఫైట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై నాని బూతు పురాణం త‌ప్పా? ఒప్పా? అనే విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. అంతిమంగా త‌న ప్ర‌యోజ‌నాల కంటే జ‌గ‌న్ కోస‌మే చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో కొడాలి విరుచుకుప‌డుతున్నార‌నేది వాస్త‌వం.

ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ దారి తీసిందంటే…  

“ద‌రిద్రుడా నోరు అదుపులో పెట్టుకో. నానీ… 2024లోపు మ‌మ్మ‌ల్ని చంపెయ్యి. మేం చ‌చ్చిపోతే నీకేమీ వుండ‌దు. లేదంటే నిన్ను చంపేస్తాం. నీకు లాస్ట్ అండ్ ఫైన్ వార్నింగ్ ఇదే” అని హెచ్చ‌రించే వ‌ర‌కూ వెళ్లింది. రేపు అధికార మార్పిడి జ‌రిగి, టీడీపీ నేత‌లు హెచ్చ‌రించినంత ప‌ని చేస్తే…. మూల్యం మాత్రం కొడాలి నాని కుటుంబం చెల్లించుకోవాల్సి వుంటుంది. పైగా ప‌దేప‌దే మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించినా సిగ్గు రాలేదా? అని కొడాలిని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది కొడాలి అభిమానుల మ‌న‌సుల‌ను గాయ‌ప‌రుస్తోంది.

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే కొన్నేళ్ల క్రితం జ‌గ‌న్‌, ఆయ‌న తండ్రి వైఎస్సార్ మ‌ధ్య పోలిక చూపుతూ ఓ చ‌క్క‌టి మాట అన్నారు. అదేంటంటే…  “న‌మ్ముకున్న వాళ్ల కోసం వైఎస్సార్ త‌న త‌ల‌ను క‌త్తికి అడ్డంగా పెడ‌తారు. ఇదే జ‌గ‌న్ అయితే త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల త‌ల‌ను క‌త్తికి అడ్డం పెడ‌తారు” అని విశ్లేషించారు. చాలా విష‌యాల్లో ఆర్కేతో విభేదాలు ఉండొచ్చు. కానీ కొడాలి నాని, పేర్ని నాని లాంటి న‌మ్మ‌క‌మైన మంత్రుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం చూస్తే… ఆర్కే విశ్లేష‌ణ‌ను కొట్టి పారేయ‌లేని ప‌రిస్థితి.