అధికారంలో ఉన్నంతసేపు ఆడింది ఆటగా ఉండేది. చిన్నచిన్న మనస్పర్థలు, అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ అక్రమార్జన యావలో పడి వాటిని పెద్దగా పట్టించుకోలేదు తెలుగుదేశం నేతలు. అలా నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో, పదవులు పోయాయో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలయ్యాయి. ఇప్పటికే దాదాపు ప్రతిజిల్లాలో ఈ తరహా కుమ్ములాటలు తెరపైకొచ్చాయి. గుంటూరు జిల్లా రచ్చ ఏకంగా చంద్రబాబు వద్దకే చేరింది.
గుంటూరు జిల్లాకు చెందిన ఎంపీ గల్లా జయదేవ్, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య విబేధాలు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరాయి. తన ఓటమికి గల్లానే కారణమని ఆరోపిస్తున్నారు డొక్కా మాణిక్యవరప్రసాద్. తన కోసం ప్రచారం చేయకుండా గల్లా మొహం చాటేశారు. దీనికితోడు గల్లా తల్లి అరుణకుమారి సైతం తనపై కక్షకట్టారు డొక్కా ఆరోపిస్తున్నారు.
తన నియోజకవర్గంలో తిరుగుతూ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని.. ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోమని, ఎంపీ ఓటు మాత్రం టీడీపీకే వేయాలని కోరుతూ ప్రజల్లో ప్రచారం చేశారని డొక్కా ఆరోపిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ఈయన ఈ పంచాయితీని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారు. తన నియోజకవర్గంలో ఉన్న మండలస్థాయి నేతలు కొందర్ని గ్రూపుగా చేసి, వాళ్ల ద్వారా చంద్రబాబుకు గల్లాపై ఫిర్యాదు చేయించారు.
ఈ విషయం ఆనోటా ఈనోటా గల్లా జయదేవ్ కు కూడా చేరింది. ఆయన కూడా తక్కువ తినలేదు కదా. డొక్కా మాణిక్యవరప్రసాద్ పై రివర్స్ లో చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తను గెలిచినప్పటికీ.. ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి డొక్కా నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని నేరుగానే చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ పంచాయితీని ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు పరిష్కరించాల్సిందే. చూసీచూడనట్టు ఊరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ కాచుకొని కూర్చొంది.
జిల్లాల వారీగా నడుస్తున్న ఈ అంతర్గత కుమ్ములాటల్ని బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వివాదాల్ని తమకు అనుకూలంగా మార్చుకొని, ఏదో ఒక వర్గాన్ని తమవైపు లాక్కోవాలని భావిస్తోంది. గుంటూరులో జరుగుతున్న అంతర్గత వివాదాన్ని చంద్రబాబు పరిష్కరించకపోతే.. కచ్చితంగా ఓ వర్గం బీజేపీకి జంప్ అవుతుంది. అదే ఇప్పుడు బాబును ఎక్కువగా కలవరపెడుతోంది.
ఓవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శల్ని ఎదుర్కొంటూ, వాళ్లకు సమాధానానిస్తూనే మరోవైపు ఇలా పార్టీలో నడుస్తున్న అంతర్గత విబేధాల్ని పరిష్కరించడం బాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయంలో సహాయం చేయడానికి మరో హ్యాండ్ అందుబాటులో లేకపోవడం బాధాకరం. ఇది ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధం.