బొత్స చేతికి వ్యవసాయ బడ్జెట్.. ఈ రోజు మాత్రమే

ఆర్థిక బడ్జెట్ కు అనుబంధంగా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలకు కేటాయింపుల్ని ఈ బడ్జెట్ లో మరింత వివరంగా చూపించబోతున్నారు. దాదాపు 28…

ఆర్థిక బడ్జెట్ కు అనుబంధంగా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలకు కేటాయింపుల్ని ఈ బడ్జెట్ లో మరింత వివరంగా చూపించబోతున్నారు. దాదాపు 28 వేల కోట్ల రూపాయలతో ఈరోజు వ్యవసాయ బడ్జెట్ సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే వ్యక్తి మాత్రం మారిపోయారు.

సాధారణంగా వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రవేశపెడతారు. కానీ ఈరోజు సభ ముందుకు రాబోతున్న వ్యవసాయ బడ్జెట్ ను మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి ప్రవేశపెట్టడం లేదు. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు స్థానంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.

కురసాల కన్నబాబు సోదరుడు మొన్న రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో ఆయన బడ్జెట్ సమావేశాలకు దూరమయ్యారు. అందుకే ఆయన స్థానంలో బొత్స, వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సభ ముందు ఉంచిన తర్వాత.. ప్రతిపక్షం లేవనెత్తనున్న ప్రశ్నలకు కూడా బొత్స సత్యనారాయణే సమాధానాలు ఇవ్వబోతున్నారు. అటు మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి మోపీదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.

ఈసారి వ్యవసాయ బడ్జెట్ కు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్ వ్యవసాయ రంగానికి కేవలం 19వేల కోట్ల రూపాయల నిధులు మాత్రమే కేటాయించింది. వీటిలో 8వేల కోట్ల రూపాయల నిధుల్ని కనీసం మంజూరు కూడా చేయలేదు. మరో 4వేల కోట్ల రూపాయల నిధుల్ని ప్రభుత్వం మంజూరు చేసినా వాటిని వాడలేదు. 2017-18, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.

ఈసారి మాత్రం దానికి భిన్నంగా పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చేలా, పారదర్శకంగా వ్యవసాయ బడ్జెట్ ను తయారుచేసినట్టు తెలుస్తోంది. ఇన్-పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు రైతుభరోసా పథకానికి భారీగా కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన ప్రకటనను కూడా వ్యవసాయ బడ్జెట్ కిందే ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. విద్యుత్ శాఖకు కేటాయించిన నిధులకు, వ్యవసాయశాఖకు సంబంధించిన విద్యుత్ సబ్సిడీకి మధ్య పొంతన ఉండేదికాదు. ఈసారి ఈ విషయంలో పారదర్శకత చూపే అవకాశం ఉంది.

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!