కేంద్రం మొండిచేయి.. ఇప్పుడు జగన్ పరిస్థితేంటి?

ఓ వైపు ఘనంగా నవరత్నాల్ని ప్రకటించారు. ఇప్పటికే పలు రాయితీలు ప్రకటించారు. కొన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించారు. వీటన్నింటినీ అమలు చేయాలంటే డబ్బుకావాలి. మరోవైపు కేంద్రం మొండిచేయి చూపించింది. బడ్జెట్ లో ఏపీకి…

ఓ వైపు ఘనంగా నవరత్నాల్ని ప్రకటించారు. ఇప్పటికే పలు రాయితీలు ప్రకటించారు. కొన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించారు. వీటన్నింటినీ అమలు చేయాలంటే డబ్బుకావాలి. మరోవైపు కేంద్రం మొండిచేయి చూపించింది. బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం చేసింది. సాధారణంగా వచ్చే కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రజల ముందుకు రాబోతోంది. మరి జగన్ ఏం చేయబోతున్నారు?

దాదాపు 2 లక్షల 31 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు జగన్. ఈరోజు ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ను సభలో చదివి వినిపిస్తారు. నవరత్నాల అమలులో భాగంగా ఏ వర్గానికి ఎన్ని కేటాయింపులు అనే విషయాన్ని వివరించబోతున్నారు. అయితే ఏ వర్గానికి ఎంత కేటాయించారు, ఏ శాఖకు ఎన్ని కోట్లు ఇచ్చారనే అంశం కంటే.. కేటాయించిన డబ్బును ఏ రూపంలో సంపాదించబోతున్నారనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టిపడింది.

కేంద్రం నుంచి ఏమీరాదని తేలిపోవడంతో.. ఇంత మొత్తాన్ని ఎలా సమకూర్చుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అప్పు చేసే పరిస్థితి కూడా లేదు. పరిమితికి మించి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇప్పటికే పూర్తిగా ముంచేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో 2 లక్షల కోట్ల రూపాయల్ని జగన్ ఎలా చూపిస్తారనేది అందర్లో ప్రశ్న. మరోవైపు గత సర్కార్ బకాయిల్ని కూడా భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

చంద్రబాబు సర్కార్ రైతులకు 2వేల కోట్ల ఇన్-పుట్ సబ్సిడీని గతంలో ప్రకటించింది. కానీ ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వలేదు. కావాలంటే జగన్ దాన్ని పక్కనపెట్టొచ్చు. కానీ అలా చేయలేదు. రైతుల కోసం తను ప్రకటించనున్న పథకాలకు అదనంగా గతంలో చంద్రబాబు మాటిచ్చి తప్పిన ఇన్-పుట్ సబ్సిడీని కూడా అందించాలని నిర్ణయించారు. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. గృహనిర్మాణం, అగ్రిగోల్డ్ బాధితులు, విద్యుత్ సబ్సిడీల విషయంలో చంద్రబాబు గతంలో వాగ్దానాలు ఇచ్చి మాటతప్పారు. వాటన్నింటినీ ఇప్పుడు జగన్ అమలు చేయబోతున్నారు.

ఈరోజు బడ్జెట్ లో అత్యథిక కేటాయింపులు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి కేటాయించే అవకాశం ఉంది. ఈ పథకం తర్వాత ప్రాజెక్టులు, ఆరోగ్య రంగాలకు అధిక కేటాంపులు జరిపే ఛాన్స్ ఉంది. మరోవైపు చంద్రబాబు గతంలో ప్రకటించి, మధ్యలో వదిలేసిన కొన్ని పథకాలను జగన్ సర్కార్ పూర్తిగా పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. వాటికి కేటాయించిన నిధుల్ని అమ్మ ఒడి, వైఎఎస్ఆర్ రైతుభరోసా లాంటి పథకాలకు విస్తరించబోతున్నారు. ఇలా కొన్ని సర్దుబాట్లు చేసినప్పటికీ.. దాదాపు 70వేల కోట్ల రూపాయల లోటను ఎలా భర్తీచేస్తారు.. బడ్జెట్ లో ఆ మొత్తాన్ని ఎలా చూపిస్తారనేది పెద్ద ప్రశ్న.

ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అదే సమయంలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!