చివ‌రికి తొడ‌లు కొట్టినామే దిక్కు!

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాలంటూ అర‌స‌విల్లి వ‌ర‌కూ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌పై మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని వ‌ద్ద‌న‌డం ముమ్మాటికీ ఉత్త‌రాంధ్ర‌పై దాడి అని ఆ ప్రాంత అధికార పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ఎదురు…

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాలంటూ అర‌స‌విల్లి వ‌ర‌కూ చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌పై మాట‌ల తూటాలు పేలుతున్నాయి. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని వ‌ద్ద‌న‌డం ముమ్మాటికీ ఉత్త‌రాంధ్ర‌పై దాడి అని ఆ ప్రాంత అధికార పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ఎదురు దాడికి దిగారు. త‌మ ప్రాంతానికి రాజ‌ధాని వ‌ద్దంటూ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగితే చంద్ర‌బాబునాయుడే బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌ని ఏకంగా అధికార పార్టీ నేత‌లు వార్నింగ్‌లు ఇస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. విశాఖ‌కు రాజ‌ధాని వ‌ద్ద‌ని గ‌ట్టిగా మాట్లాడే వాళ్లే క‌రువ‌య్యారు. దీంతో ఆ పార్టీకి తొడ‌లు కొట్టే టీడీపీ అధికార ప్ర‌తినిధి గ్రీష్మే దిక్కయ్యారు. ఎందుకంటే ఈమెకు ప్ర‌జ‌ల‌తో ఏ మాత్రం సంబంధం లేదు. ఎల్లో మీడియాతో త‌ప్ప స‌మాజం, ప్ర‌జానీకంతో సంబంధాలు లేక‌పోవ‌డంతో ఎవ‌రికీ బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు. ఆ బాధ్య‌తా రాహిత్య‌మే వేలాది మంది పాల్గొన్న స‌భ‌లో తొడ‌లు కొడుతూ, అభ్యంత‌ర‌క‌ర భాష‌లో ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విస‌ర‌గ‌లిగారామె.

అమ‌రావ‌తి ఉద్య‌మానికి ఉత్త‌రాంధ్ర మ‌ద్ద‌తు ఉందంటూ ఆమె చెబితే, అదే ఎల్లో మీడియాకు ప్రాధాన్య వార్త అయ్యింది. దీన్ని బ‌ట్టి ఉత్త‌రాంధ్ర‌లో అమ‌రావ‌తిపై టీడీపీ మ‌న‌సులో ఏముందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకైనా మంచిద‌ని ఆచితూచి మాట్లాడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిని వ్య‌తిరేకించిన నాయ‌కులుగా ముద్ర వేయించుకోడానికి ఉత్త‌రాంధ్ర టీడీపీ ముఖ్య నేత‌లు సిద్ధంగా లేర‌ని స‌మాచారం.

చివ‌రికి గ్రీష్మ ఒక్క‌టే టీడీపీకి దిక్క‌య్యార‌ని చెబుతున్నారు. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు ఉత్తరాంధ్ర నుంచి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు గ్రీష్మ ప్రకటించారు. క‌నీసం ఏ ఎన్నిక‌లోనూ ప్ర‌జాప్ర‌తినిధిగా గెల‌వ‌ని గ్రీష్మ ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌తినిధి అయ్యిన‌ట్టు బిల్డ‌ప్ ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.