మరణం అని వార్యం.82 ఏళ్ల వార్థక్యం..శారీరక రుగ్మతలు..వీటి కారణంగా సీనియర్ హీరో కృష్ణం రాజు మరణించారు. సీనియర్ హీరోల పేర్లు చెప్పుకునేటపుడు ఎన్టీఆర్..ఎఎన్నార్…కృష్ణ..కృష్ణరాజు..శోభన్ బాబు…అని కచ్చితంగా చెప్పుకునేవారు. అలా ఆ టాప్ జాబితాలో పేరు సంపాదించుకున్నారు కృష్ణం రాజు.
తెలుగు నాట తన ఆహార్యంతో, నటనతో, మాడ్యులేషన్ తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణం రాజు. ఆయన నటించిన చాలా పాత్రలు టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయేవే. జీవనతరంగాలు సినిమాలో బ్యాడ్ సన్ గా, కటకటాల రుద్రయ్యలో మాస్ పాత్ర ఒక ఎత్తు. తనకు కావాల్సిన పాత్రలు తనే సాధించుకోవాలని, నిర్మాతగా మారి చేసిన భక్త కన్నప్త తో ఆయన తీరు మారిపోయింది. బొబ్బిలి బ్రహ్మన్న, విశ్వనాధ నాయకుడు, అమరదీపం, మనవూరి పాండవులు, తాండ్ర పాపారాయుడు లాంటి వాటిలో కొన్ని సినిమాలు ఆయన నిర్మాతగా మారడం వల్ల వచ్చినవే.
కృష్ణ వేణి సినిమాతో నిర్మాతగా మారారు. ఆ రోజుల్లో కలర్ ఫుల్ చిత్రీకరణ అంటే ఇలా వుంటుంది అనిపించారు. భక్త కన్నప్ప సినిమా తెలుగు సినిమాల్లో అజరామరంగా నిలిచిపోతుంది. దాసరి తో కలిసి చేసిన సీతారాములు కూడా మంచి సినిమా. రామోజీ ఫిలిం సిటీ అందాలు పరిచయం చేయడం, పనిలో పని మంచి సినిమా నిర్మించడం అనే రెండు లక్ష్యాలతో నిర్మించిన మా నాన్నకు పెళ్లి సినిమా కృష్ణంరాజు చివరి దశలో నటించిన ఓ మంచి సినిమా. హీరో పాత్రలు పక్కన పెట్టి ప్రత్యేకమైన మంచి పాత్రలు చేయడం మొదలు పెట్టిన తరువాత బాలకృష్ణ, రాజశేఖర్. ప్రభాస్ ఇలా చాలా మంది యంగ్ హీరోల సినిమాల్లో కనిపించారు.
తన సోదరుడు సూర్యనారాయణ రాజు నిర్మాతగా సినిమాలు నిర్మించారు. ఆయన కొడుకు ప్రభాస్ ను పెద్ద హీరోను చేసారు.
సినిమాల తరువాత కొంతకాలం పారిశ్రామికవేత్తగా కూడా కృషి చేసారు. అది అంతగా కలిసిరాలేదు. రాజకీయాల్లోకి వెళ్లారు. భాజపా తరపున గెలిచి కేంద్ర మంత్రి గా పని చేసారు. చిరంజీవి ప్రజారాజ్యం తరపున పోటీ చెేసి ఓడిపోయారు.
మొదటి భార్య మరణించాక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. చిరకాలంగా ఇంట్లోనే వుంటున్నారు. ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒకరు నిర్మాణ రంగంలో కృషి చేస్తున్నారు.