బీజేపీ నేత‌ల‌కు జ‌న‌సేన టికెట్లు.. ఏపీలో టికెట్ల‌పై ట్రోలింగ్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ టాలీవుడ్ అగ్ర‌హీరో. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు ఏమంత పెద్ద తేడా వుండ‌ద‌నేది ఆయ‌న ఫీలింగ్‌. అందుకే వారాహి యాత్ర‌కు సంబంధించి వాహ‌నాన్ని కూడా సినిమా రేంజ్‌లో ప‌రిచ‌యం చేశారు. ప‌వ‌న్ మాట తీరు,…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ టాలీవుడ్ అగ్ర‌హీరో. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు ఏమంత పెద్ద తేడా వుండ‌ద‌నేది ఆయ‌న ఫీలింగ్‌. అందుకే వారాహి యాత్ర‌కు సంబంధించి వాహ‌నాన్ని కూడా సినిమా రేంజ్‌లో ప‌రిచ‌యం చేశారు. ప‌వ‌న్ మాట తీరు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో న‌డ‌వ‌డిక అంతా సినిమాను త‌ల‌పిస్తూ వుంటుంది.

జ‌న‌సేన అభ్య‌ర్థుల ఎంపిక కూడా సినిమాను త‌ల‌పించేలా వుంద‌న్న విమ‌ర్శ. తెలంగాణ‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. తెలంగాణ‌లో జ‌నసేన‌తో త‌మ పార్టీ పొత్తు ఎందుకు పెట్టుకున్న‌దో అర్థంకాక బీజేపీ నేత‌లు సైతం త‌ల‌లు గోక్కుంటున్నారు. 32 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని పొత్తుకు ముందు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. పొత్తు త‌ర్వాత 8 స్థానాల‌తో ప‌వ‌న్ స‌రిపెట్టుకున్నారు.

ఆ 8 స్థానాల‌కు మంగ‌ళ‌వారం జ‌న‌సేన అధిష్టానం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. అందులో కూడా సోమ‌వారం బీజేపీ నుంచి పార్టీలో చేరిన ఇద్ద‌రు నాయ‌కులు జ‌న‌సేన టికెట్ ద‌క్కించుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక మిగిలింది ఆరు సీట్లు. వారి గురించి కూడా లోతుగా అధ్య‌య‌నం చేస్తే… మూలాలు బీజేపీనే అని తేలుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ మాత్రం సంబ‌రానికి జన‌సేనాని ఏ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఆశించి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

బీజేపీ నుంచి జ‌న‌సేన‌లో టికెట్ ద‌క్కించుకున్న నేత‌ల గురించి తెలుసుకుందాం. కూక‌ట్‌ప‌ల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, అలాగే కొత్త‌గూడెం నుంచి ల‌క్కినేని సురేంద‌ర్‌రావు జ‌న‌సేన టికెట్లు ద‌క్కించుకోవ‌డం విశేషం. వీళ్లిద్ద‌రూ కూడా ఈ నెల 6న జ‌న‌సేన‌లో చేరి, 7న టికెట్లు ఖ‌రారు చేయించుకోగ‌లిగారు.

2018 ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లిలో టీడీపీ అభ్య‌ర్థి నంద‌మూరి సుహాసినికి మ‌ద్ద‌తుగా ప్రేమ్‌కుమార్ ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. కూక‌ట్‌ప‌ల్లి నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేయాల‌ని భావించారు. అయితే జ‌న‌సేన‌కు ఆ సీటును కేటాయిస్తున్నార‌నే సంకేతాలు వెలువ‌డ‌డంతో ప్రేమ్‌కుమార్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బీజేపీ నేత‌లు ఆయ‌న్ని జ‌న‌సేన‌లో చేర్పించారు. ఆయ‌న‌కే టికెట్ వ‌చ్చేలా చేశారు.

బేతంపూడి ప్రాథ‌మిక స‌హ‌కార సంఘం అధ్య‌క్షుడిగా ల‌క్కినేని సురేందర్‌రావు ప‌ని చేస్తున్నారు. ఈయ‌న గ‌త నెల 9న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్‌రెడ్డి స‌మ‌క్షంలో కాషాయ కండువా ఆయ‌న క‌ప్పుకున్నారు. కొత్త‌గూడెం టికెట్‌ను ఆశించారు. అయితే జ‌న‌సేన ఆ సీటును అడుగుతున్న‌ట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ పార్టీలోకి ఈ నెల 6న జంప్ అయ్యారు. ఆయ‌న‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ కండువా క‌ప్పారు. టికెట్‌ను కూడా ఖ‌రారు చేశారు.  

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తున్న‌దంటే… ఏపీలో టీడీపీతో జ‌న‌సేన పొత్తు కుదుర్చుకున్న నేప‌థ్యంలో టికెట్ల పంపిణీ ఎలా వుంటుందో అర్థం చేసుకోడానికే. జ‌న‌సేన‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ టికెట్లు త‌ప్ప‌, మిగిలిన‌వన్నీ టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడే కేటాయిస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఎప్ప‌టి నుంచో చెబుతున్నాయి. టీడీపీ నేత‌లు చెప్పేదే నిజ‌మ‌నేందుకు  తెలంగాణ‌లో బీజేపీ నుంచి చేరి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌కుండానే జ‌న‌సేన టికెట్టు ఇవ్వ‌డ‌మే నిద‌ర్శ‌నం. 

తెలంగాణ‌లో జ‌న‌సేన టికెట్ల పంపిణీ కేవ‌లం ట్రైల‌ర్ అని, ఏపీలో అస‌లు సినిమా ముందుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ సినిమా ఎంత ద‌రిద్రంగా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని ప‌లువురు అంటున్నారు. ఎందుకంటే, జ‌న‌సేన టికెట్ల‌న్నీ టీడీపీ అభ్య‌ర్థుల‌కే ఇస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదంటూ… తెలంగాణ ఎపిసోడ్‌ను ఉద‌హ‌రిస్తున్నారు.