బ‌స‌వ‌రాజ్ బొమ్మై.. బీజేపీని ర‌క్షించేస్తారా?!

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ రిపేర్ల‌లో భాగంగా ఏకంగా య‌డియూర‌ప్ప‌ను సీఎం పీఠం నుంచి దించేసింది అధిష్టానం. అయితే ఆ త‌ర్వాత ఆచితూచి స్పందించింది. మాస్ లీడ‌ర్ ను అయితే ఈజీగా ఇంటికి పంపించారు…

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ రిపేర్ల‌లో భాగంగా ఏకంగా య‌డియూర‌ప్ప‌ను సీఎం పీఠం నుంచి దించేసింది అధిష్టానం. అయితే ఆ త‌ర్వాత ఆచితూచి స్పందించింది. మాస్ లీడ‌ర్ ను అయితే ఈజీగా ఇంటికి పంపించారు కానీ, ఆయ‌న త‌ర్వాత ఎవ‌ర‌నే అంశంపై బీజేపీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డింది. 

వారు, వీరు అంటూ ఏకంగా ఎనిమిది నుంచి ప‌ది పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. చివ‌ర‌కు లింగాయ‌త్ కే క‌ర్ణాట‌క సీఎం పీఠం ద‌క్కింది. లింగాయ‌త్ ల‌లో కూడా య‌డియూర‌ప్ప‌- బ‌స‌వ‌రాజ్ బొమ్మై ఒకే ఉప‌కులానికి చెందిన వార‌ని తెలుస్తోంది.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి మార్పు ఆస‌క్తిదాయ‌క‌మైన నిర్ణ‌య‌మే. వాస్త‌వానికి బీజేపీకి ప్ర‌స్తుత అధికార కాల‌మే బోన‌స్. వారికి స్ప‌ష్ట‌మైన మెజారిటీ లేకుండానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ల‌ను చీల్చి ప్ర‌భుత్వాన్ని స్థిర ప‌రుచుకున్నారు. ఏతావాతా బోన‌స్ అధికార కాలాన్ని స‌జావుగా సాగించ‌కుండా మార్పు చేర్పుల‌కు దిగ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశ‌మే!

య‌డియూర‌ప్ప నాయ‌క‌త్వంలోని తీవ్ర స్థాయి అవినీతే ఈ మార్పుకు ప్ర‌ధాన‌కార‌ణ‌మ‌ని స్ప‌ష్టం అవుతోంది. య‌డియూర‌ప్ప‌, ఆయ‌న త‌న‌యులిద్ద‌రూ అధిష్టానానికి పంగ‌నామాలు పెట్టార‌నే టాక్ వ‌స్తోంది. ఎన్ని సార్లు చెప్పినా ప‌ద్ధ‌తి మార్చుకోలేద‌ని, వీరిపై రిపోర్టులు ప‌దే ప‌దే ఢిల్లీ వ‌ర‌కూ వెళ్ల‌డంతో చివ‌ర‌కు మార్పు జ‌రిగింద‌ని స‌మాచారం. అయితే లింగాయ‌త్ ల‌లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే భ‌యంతో .. చివ‌ర‌కు అదే సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త ద‌క్కింది.

ప‌ద‌విని స్వీక‌రించడానికి ముందే బొమ్మై మాట్లాడుతూ.. య‌డియూర‌ప్ప‌పై విధేయ‌త‌ను చాటుకున్నాడు. ఆయ‌న సల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డానికి అభ్యంత‌రం లేద‌న్నారు. అయితే త‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని స్వీక‌రించ‌నంటూ, క‌ర్ణాట‌క రాజ‌కీయంలోనే ఉంటానంటూ య‌డియూర‌ప్ప ప్ర‌క‌టించారు. ఆయ‌న త‌న‌యులిద్ద‌రూ పొలిటిక‌ల్ గా యాక్టివ్ గా ఉన్నారు. వారంతా క‌లిసి ప్రస్తుత ప్ర‌భుత్వాన్ని ఏ మేర‌కు ప్ర‌శాంతంగా ఉంచుతార‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. 

ఇక ఈ మ‌ధ్య‌నే ఒక లోక్ స‌భ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగితే బీజేపీ చ‌చ్చిచెడి అక్క‌డ ఐదు వేల మెజారిటీని సాధించింది. సానుభూతి ఉప ఎన్నిక‌, అదే పార్టీ అధికారంలో ఉండ‌గా జ‌రిగిన ఉప ఎన్నిక‌లో.. బీజేపీ బ‌లం అలా బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌తిప‌క్షాలు బ‌లం చూపే ప‌రిస్థితుల్లో లేవు కానీ, లేక‌పోతే బీజేపీ ఆట‌ల‌కు ఎప్పుడో చెక్ ప‌డేది. 

క‌న్న‌డ ప్ర‌జ‌ల్లో మాత్రం క‌మ‌లం పార్టీపై విశ్వాసం స‌న్న‌గిల్లింది. దాన్ని తిరిగి ప్రోదికొల్పాల‌నే ప్ర‌య‌త్నంలో ముఖ్య‌మంత్రినే మార్చేశారు. మరి ఈయ‌న ట‌ర్మ్ ఎన్నాళ్ల‌నేదే ముందున్న పెద్ద ప్ర‌శ్న‌! అధిష్టానం ఆదేశాల‌ను పాటించ‌డం మీదే అది అధార‌ప‌డి ఉండ‌వ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌డంతో ప‌ని లేదిక‌!