థియేటర్లు మూతపడడంపై, టికెట్ రేట్ల వ్యవహారం పై ఇప్పటి వరకు ఏ హీరో కూడా పెదవి విప్పలేదు. ఇదంతా ఓ ప్రభుత్వంతో వ్యవహారం కావడంతో ఎవ్వరూ పైకి మాట్లాడడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసాడు నాని. తిమ్మరసు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు హీరో నాని. ఈ సందర్బంగా నాని తన ప్రసంగంలో చెప్పిన మాటలు కాస్త ఆలోచింపదగ్గవిగానే వున్నాయి. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడడం, ఎంతకీ తెరుచుకోకపోవడంపై నాని తన ఆవేదనను స్మూత్ గా వ్యక్తం చేసారు.
విదేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ..నాన్నను లేదా స్నేహితులను చూడ్డానికి వెళ్తారు. కానీ మన దేశంలో అమ్మ నాన్నలను లేదా స్నేహితులను తీసుకుని సినిమాకు వెళ్తామని అది మన అలవాటు అని ఆయన అన్నారు.
కరోనా లేదా ఇలాంటి పాండమిక్ సిట్యువేషన్ లో థియేటర్లు మూసి వేయడం మంచిదే అని కానీ సమస్య ఏమిటంటే అందరి కన్నా ముందుగా మూతపడేవి థియేటర్లు, ఆఖరున తెరచుకునేవి థియేటర్లు అని అన్నారు.
థియేటర్ల కన్నా ముందుగా తెరచుకున్న అనేకానేక వ్యవస్థల దగ్గర జనం ఎలా వుంటున్నారో ఓసారి గమనించాలన్నారు. తన టక్ జగదీష్ విడుదల వుందని ఇలా మాట్లాడడం లేదని, సినిమా అంటే హీరోలు, నిర్మాతలే కాదు, థియేటర్ వ్యవస్థ అనే పెద్ద వ్యవస్థ వుందని మరిచిపోతున్నాం అని ఆయన అన్నారు.
ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు అపరిమితంగా పెరిగిపోతున్నాయని, కానీ సినిమా టికెట్ ల దగ్గరకు వచ్చే సరికి మాత్రం అనేక నిబంధనలు అడ్డం పడుతున్నాయని అన్నారు. పైగా టికెట్ ల రేట్ల సమస్య పరిష్కారం అత్యవసర సమస్య కాదంటున్నారని, అది సరికాదని నాని అన్నారు. థియేటర్ల సిబ్బందికి మాత్రం ఇది అత్యవసరంగా పరిష్కారం కావాల్సిన సమస్యే అన్నారు.