తమది బరాబర్ హిందువుల పార్టీ అంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. దక్షిణాది బీజేపీ నేతలు కూడా ఈ ప్రకటనలు బాహాటంగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి మత పార్టీ.. కర్ణాటకలో కులానికి తలొగ్గక తప్పలేదు. అవినీతి కంపు కొడుతున్న యడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించినా, ఆ స్థానంలో లింగాయత్ నే, అది కూడా సదర లింగాయత్ నే కూర్చోబెట్టింది. యడియూరప్పను దించితే లింగాయత్ లకు కోపం వస్తుందనే భయం బీజేపీని వెన్నాడింది. పలు ప్రత్నామ్నాయ పేర్లున్నా చివరకు సదర లింగాయత్ అయిన బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రిని చేసింది కమలం పార్టీ.
యడియూరప్ప ను బీజేపీ హైకమాండ్ తొలగించడం ఖాయమనే ప్రచారం జరిగిన సమయంలోనే లింగాయత్ స్వామీజీలు సామూహికంగా ఆయనను కలిశారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో లింగాయత్ ల జనాభా 16శాతం. యడియూరప్ప ఎదుగుదలలో బీజేపీ కన్నా, కులానిదే ప్రముఖ పాత్ర.
హిందుత్వ అజెండా కన్నా కులం జెండానే ఎక్కువగా నమ్ముకుని వచ్చారు యడియూరప్ప. ఆయన ప్రస్థానంలో కులమే కీలక పాత్ర పోషించింది. ఎన్నడూ వీర హిందుత్వ వాద డైలాగులను వల్లెవేసిన వ్యక్తి కూడా కాదు యడియూరప్ప. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ కోర్ కులతత్వ రాజకీయాలతోనే యడియూరప్ప తను రాజకీయంగా బలపడ్డాడు, బీజేపీని కూడా బలోపేతం చేశాడు.
వాస్తవానికి బీజేపీకి కర్ణాటకలో అధికారాన్ని అందుకునేంత సీన్ ఎప్పటికీ ఉండేది కాదు. అదంతా ఒక రకంగా జేడీఎస్ అవకాశవాద రాజకీయాల పుణ్యం.సర్వవేళలా హంగ్ తరహా ఫలితాలను ఇచ్చే కన్నడ ప్రజల తీర్పుతో.. బీజేపీ-జేడీఎస్ లు 2007 సమయంలో ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ల అధికార కాలాన్ని అనుభవించిన కుమారస్వామి, రెండో సగం అధికార కాలాన్ని బీజేపీకి అప్పగించకుండా హ్యాండిచ్చాడు. యడియూరప్ప తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే మద్దతును ఉపసంహరించుకున్నాడు. కుమారస్వామి చేసిన మోసం తో బీజేపీ పై ప్రత్యేకించి యడియూరప్పపై సానుభూతి వర్షించింది.
ఆ సానుభూతి ఫలితంగా తొలి సారి సొంతంగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత శక్తిగా ఎదిగింది బీజేపీ. కనీసం ఏడాదో , రెండేళ్లో యడియూరప్పను కుమారస్వామి సీఎం పీఠంపై కూర్చోబెట్టి ఉంటే.. అంతటితో బీజేపీ ముచ్చట ముగిసేది. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకతతో కథ కంచికి చేరేది. అయితే.. కుమారస్వామి చేసిన మోసం తో బీజేపీ తొలి సారి కనీస మెజారిటీతో అధికారాన్ని అందుకుంది. పునాదులను పదిల పరుచుకుంది. క్రమంగా కర్ణాటకలో రాజకీయ శక్తిగా మారింది. ఈ క్రమంలో లింగాయత్ ల మద్దతు బీజేపీకి కనీస ఓటు బ్యాంకును ఏర్పరిచింది.
లింగాయత్ లు బీజేపీని గట్టిగా సపోర్ట్ చేస్తారనే కన్నా.. యడియూరప్పనే నమ్మారనేది నిజం. యడియూరప్ప సొంత పార్టీ పెట్టినప్పుడు నాలుగైదు శాతం ఓట్ల పడ్డాయి. స్థూలంగా బీజేపీ పది శాతం ఓట్లను దూరం చేసి, అధికారానికి ఆమడ దూరంలో ఉంచాడు యడియూరప్ప. ఇప్పుడు కూడా లింగాయత్ లు యడియూరప్పనే కోరుకున్నారు.
బ్రహ్మణ, వక్కలిగ సామాజికవర్గాలకు చెందిన నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, చివరకు వారి వైపు మొగ్గే సాహసం చేయలేకపోయింది బీజేపీ. వక్కలిగకు సీఎం పీఠాన్ని ఇచ్చినా ఆ సామాజికవర్గాలను జేడీఎస్ కు దూరం చేయడం అసాధ్యం. వక్కలిగల్లో కొద్దో గొప్పో చీలిక తెచ్చింది డీకే శివకుమార మాత్రమే. జేడీఎస్ కు సంప్రదాయక ఓటు బ్యాంకు అయిన వక్కలిగల్లో కొద్దిశాతాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించగలిగాడు శివకుమార. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ కీ లీడర్ స్థాయిలో ఉన్నాడు. అలాంటప్పుడు బీజేపీ మరో వక్కలిగకు పీఠాన్ని అప్పగించినా లింగాయత్ లు పూర్తిగా దూరం కావడమే తప్ప మరో ఉపయోగం ఉండదు.
ఇక బ్రహ్మణులకు పీఠాన్ని అప్పగించినా, ఉన్నది నాలుగు శాతం ఓట్లు. వక్కలిగ లేదా బ్రహ్మణ సీఎం వస్తే.. యడియూరప్ప ఆ ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. వచ్చే ఎన్నికల్లో లింగాయత్ లు తమ ప్రతాపం చూపిస్తారనే భయం బీజేపీ అధిష్టానాన్ని కంట్రోల్ చేసింది. చివరాఖరుకు చేసేది లేక యడియూరప్పపై ఫిర్యాదులు చేసిన వారిని, యడియూరప్ప పార్టీని వీడి వెళ్లినప్పుడు పార్టీని కాపాడుకున్న వారికి ఇప్పుడు ప్రాధాన్యతను ఇవ్వలేక, చివరకు యడియూరప్ప రెకమెండ్ చేసిన, ఆయన కులానికే చెందిన వ్యక్తికి సీఎం పీఠాన్ని ఇచ్చి, తను కుల సమీకరణాలను దాటలేనంటూ మతం పార్టీ రుజువు చేసుకుంది!