తెలిసీ…న‌ష్ట‌పోతున్న వైసీపీ!

తెలియ‌క న‌ష్ట‌పోవ‌డం గురించి విన్నాం. కానీ అన్నీ తెలిసీ న‌ష్ట‌పోవ‌డం ఒక్క వైసీపీకే చెల్లు. పైగా అధికారంలోకి వ‌చ్చాక త‌మ కంటూ ప్ర‌త్యేక గుర్తింపు, గౌర‌వం లేక‌పోవ‌డంపై వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హంగా ఉన్నాయి.  అంతేకాదు,…

తెలియ‌క న‌ష్ట‌పోవ‌డం గురించి విన్నాం. కానీ అన్నీ తెలిసీ న‌ష్ట‌పోవ‌డం ఒక్క వైసీపీకే చెల్లు. పైగా అధికారంలోకి వ‌చ్చాక త‌మ కంటూ ప్ర‌త్యేక గుర్తింపు, గౌర‌వం లేక‌పోవ‌డంపై వైసీపీ శ్రేణులు ఆగ్ర‌హంగా ఉన్నాయి.  అంతేకాదు, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాము మరింత న‌ష్ట‌పోయామ‌నే ఆవేద‌న వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపిస్తోంది. చివ‌రికి పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లినా త‌మ మాట వినే దిక్కు లేకుండా పోయిందని వైసీపీ గ్రామ‌, మండ‌ల స్థాయి నాయ‌కులు ఆవేద‌న చెందుతున్నారు.

ఎలాగైనా ఈ ద‌ఫా వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రి చేసుకోవాల‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు. ప్ర‌జాభిమానాన్ని చూర‌గొనేందుకు క్షేత్ర‌స్థాయిలో చంద్ర‌బాబు పాల‌న‌పై వ్య‌తిరేక‌త పెంచ‌డంతో పాటు తాము అధికారంలోకి వ‌స్తే చేసే ప‌నుల‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. జ‌గ‌న్‌ను అధికారంలోకి రావ‌డానికి అనేక శ‌క్తులు ప‌ని చేశాయి.

జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం, రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకోవ‌డం కూడా జ‌రిగిపోయాయి. కానీ త‌మ‌కు ఒరిగిందేమీ లేద‌నే నిస్పృహ గ్రామ‌స్థాయి మొద‌లుకుని రాష్ట్ర‌స్థాయి నేత‌ల వ‌ర‌కూ ఉంది. రాష్ట్ర ఖ‌జానా సొమ్మంతా సంక్షేమ ప‌థ‌కాల‌కే స‌రిపోవ‌డం లేదు. దీంతో ప‌రిధికి మించి రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సిన దుస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు క‌ళ్ల‌కు క‌డుతోంది. ఈ నేప‌థ్యంలో అభివృద్ధి ప‌నుల మాటే లేదు.

గ‌త పాల‌కుల హ‌యాంలో …వైఎస్సార్‌, చంద్ర‌బాబు ఎవ‌రైనా కావ‌చ్చు, ఇలాంటి ప‌రిస్థితి చూడ‌లేద‌ని రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ చెబుతున్నారు. స్థాయికి త‌గ్గ‌ట్టు చిన్నోపెద్దో ప‌నులు ఇచ్చి త‌మ‌ను న‌మ్ముకున్న నాయ‌కుల ఆర్థిక బ‌లోపేతానికి అవకాశం ఇచ్చేవాళ్లు. ఇందులో మంచీచెడు ప‌క్క‌న పెడితే, క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లంగా ఉండేందుకు ఇది చేయ‌క త‌ప్పేది కాదు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ సంక్షేమ పాల‌న పుణ్య‌మా అని అలాంటి ప‌రిస్థితి లేదు. ఒక‌వేళ ఏదైనా కాంట్రాక్ట్ ప‌ని చేయాల‌న్నా బిల్లులు రావ‌నే భ‌యం పీడిస్తోంది.

దీంతో గ్రామ‌స్థాయిలో తామెందుకు ఖ‌ర్చు పెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా న‌ష్ట‌పోవాలంటే ఎలా అనే నిల‌దీత ఆ పార్టీ శ్రేణుల నుంచి వ‌స్తోంది. మ‌రోవైపు గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా వైసీపీ త‌న నాయక‌త్వాన్ని తానే చేజేతులా చంపుకుంటోంద‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు. 

ప్ర‌జ‌ల‌తో త‌మ‌కు సంబంధం లేకుండా అన్నీ వాలెంటీర్లే చేస్తే, ఇక తామెందుక‌నే ప్ర‌శ్న గ్రామ నాయ‌కుల నుంచి బ‌లంగా విన‌ప‌డుతోంది. రానున్న మూడేళ్ల‌లో గ్రామ నాయ‌కుల్లో ఇదే ర‌క‌మైన నిర్లిప్త‌త‌, నిరాశ ఉంటే మాత్రం క్షేత్ర‌స్థాయిలో వైసీపీ త‌ప్ప‌క దెబ్బ తింటుంది.

ఎందుకంటే ఓట‌ర్ల‌ను ఎన్నిక‌ల కేంద్రం వ‌ద్ద‌కు తీసుకెళ్లాల్సింది నాయ‌కులే. ప్ర‌స్తుతం అమ‌ల‌వుతున్న వ్య‌వ‌స్థ‌… ఓట‌ర్ల‌కు, నాయ కుల‌కు మ‌ధ్య సంబంధాల్ని తెంచేలా ఉంది. అది చివ‌రికి పార్టీపై ప్ర‌భావం చూపుతుంద‌ని వైసీపీ పెద్ద‌లు ఇప్పుడిప్పుడే గ్ర‌హించి న‌ట్టున్నారు. తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్య‌లు ఈ వాస్త‌వాన్ని ప్ర‌తిబింబిస్తున్నాయి.

పార్టీ, నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల ద్వారా కాకుండా ప‌థ‌కాల ల‌బ్ధిని నేరుగా ప్ర‌జ‌ల‌కే అంద‌జేసే ప్ర‌క్రియ‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టారని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. ఇది ఒక ర‌కంగా పార్టీకి ఇబ్బందిక‌ర‌మైనా అన్ని వ‌ర్గాల అభివృద్ధే ల‌క్ష్యంగా ముఖ్య మంత్రి ముందుకు వెళుతున్నారని స‌జ్జ‌ల చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ ఒక్క వాక్యం చాలు… వైసీపీ భ‌యం ఏంటో అర్థం చేసుకో డానికి. మ‌రి అన్నీ తెలిసి కూడా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో వైసీపీ ప్ర‌భుత్వం మీన‌మేషాలు ఎందుకు లెక్కిస్తున్న‌దో అంతుబ‌ట్ట‌డం లేదు.