ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారని చెప్పొచ్చు. అందువల్లే ఆయన సారథ్యంలో ఆ పార్టీ గమ్యం, గమనం ఏంటో తెలియకుండా ప్రయాణిస్తోంది. ఈ రెండేళ్లలో ప్రతిపక్ష నేతగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో చంద్రబాబు ఏ మాత్రం చొరవ చూపలేదనేందుకు ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. ఇదే ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పార్టీకి ఐదేళ్లు చుక్కలు చూపించారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా అనేక ఉద్యమాలు చేసిన సంగతి తెలిసిందే.
నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రైతు దీక్ష, నిరుద్యోగ దీక్ష, జలదీక్ష తదితర అనేక దీక్షలతో పాటు ప్రత్యేక హోదా కోసం ఐదేళ్లూ అవిశ్రాంతంగా పోరాటం కొనసాగించారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉండగా సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నిత్యం ప్రజల్లోనూ ఉంటూ చంద్రబాబు సర్కార్‌పై అడగడుగునా ఒత్తిడి పెంచారు.
ఇదే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పనితీరుపై ప్రజల నుంచి నిట్టూర్పులొస్తున్నాయి. ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రజాపోరాటం చేసిన దాఖలాలు లేవు. పైగా కరోనా మహమ్మారి పంజా విసరడాన్ని టీడీపీ సాకుగా చెబుతోంది. కానీ ఇందులో వాస్తవం లేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో జనానికి టీడీపీ అండగా నిలబడలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి తదితర సెలబ్రిటీలు ముందుకొచ్చి ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర వైద్య సౌకర్యాలు కల్పిస్తే, ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మాత్రం కేవలం జగన్ ప్రభుత్వంపై విమర్శలతో సరిపెట్టారు.
ఈ రెండేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఏం చేసిందని ప్రశ్నిస్తే… పాజిటివ్‌గా చెప్పుకునే ఏ ఒక్క కార్యక్రమం లేదు. ఇదే నెగెటివ్‌గా చెప్పుకోవాల్సి వస్తే అనేకం ఉన్నాయి. ప్రభుత్వ పథకాల అమలుకు అడుగడుగునా రాజ్యాంగ వ్యవస్థ ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసింది, ఇప్పటికీ చేస్తోంది. తద్వారా ప్రజలకు లబ్ధి కలగకుండా మోకాలడ్డుతోందని విమర్శలకు గురి కావాల్సి వచ్చింది.
మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో రఘురామకృష్ణంరాజుతో కలిసి జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పన్నిన కుట్రలో టీడీపీ భాగస్వామ్యం అయ్యిందని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం ఆ పార్టీకి భారీ డ్యామేజీ కలిగిందని చెప్పక తప్పదు. తాము అధికారంలోకి వచ్చే క్రమంలో ప్రజల ఆదరణ పొందే ఏ ఒక్క పని ఈ రెండేళ్లలో టీడీపీ చేయకపోవడం, ఆ పార్టీకి అతి పెద్ద మైనస్ అని చెప్పక తప్పదు.
మరోవైపు జగన్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేస్తోంది. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా, సంక్షేమ పథకాల అమలును మాత్రం వీడడం లేదు. ఉద్యోగుల విషయంలో మాత్రం వ్యతిరేకతను సంపాదించుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉద్యోగుల తరపున పోరాడేంత సీన్ టీడీపీకి లేదు. ఎందుకంటే తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే శక్తిసామర్థ్యాలు ఉద్యోగ సంఘాలకు ఉన్నాయి.
జగన్ ప్రభుత్వంలో ప్రధానంగా ఇసుక, మద్యనిషేధం, మందు ధరలు విపరీతంగా పెంచడం, అభివృద్ధి పనులు లేకపోవడం, పారిశ్రామీకరణ ఊసే లేకపోవడం తదితర అంశాలపై ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ వీటిపై పోరాటం వదిలేసి, కుట్రల ద్వారా అధికారానికి చేరువ కావాలనే ఆరాటం ఆ పార్టీని మరింత బలహీనపరుస్తోందనే అభిప్రాయాలు లేకపోలేదు. కొన్ని అంశాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, దాన్ని సొమ్ము చేసుకునేందుకు టీడీపీ తగిన రీతిలో రాజకీ యాలు చేయడం లేదనే విమర్శలున్నాయి.
ఇంకా ఎన్టీఆర్‌పై వెన్నుపోటు కాలం నాటి రాజకీయాలనే నమ్ముకుని అధికారంలోకి వస్తామనే భ్రమలో టీడీపీ ఉన్నట్టుంది. తన కుట్ర రాజకీయాలకు కాలం చెల్లిందని బాబు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. ప్రస్తుత సమాజంలో కాలంతో పాటు రాజకీయాల్లో వచ్చిన మార్పులకు తగ్గట్టు తనను ఆవిష్కరించుకుంటే తప్ప చంద్రబాబుకు భవిష్యత్ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వయసులో చంద్రబాబు తనను మార్చుకుంటారా? అనేది పెద్ద ప్రశ్నే.