తెలుగు సినిమా నటీనటుల సంఘ మా ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఇక్కడ రెండు పారలల్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎలాగైనా ఎన్నికలు జరిపించి ప్రకాష్ రాజ్ ను మా అధ్యక్షుడిని చేయాలని ఓ వర్గం పట్టుదలగా వుంది. అసలు ఇప్పట్లో ఎన్నికలు జరగకుండా సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లీగల్ పాయింట్లను ఆయన ఆసరా చేసుకుంటున్నారు. ఆయన ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎన్నికల దిశగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.
ఏ కమిటీ అయితే ఎన్నికలు జరపకుండా కాలయాపన చేస్తోందో అదే కమిటీలోని సభ్యులు లేఖలు రాసి, ఎన్నికలు డిమాండ్ చేసేలా చేస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా మెగా వర్గం, కృష్ణంరాజు చేతుల మీదుగా వ్యవహారం నడిపిస్తోంది.
ఈ రెండు వ్యవహారాలు ఇలా వుంటే అనవసరంగా వీటిలోకి దూరారు మంచు విష్ణు. ఎందుకు దూరాల్సి వచ్చిందో? ఎవరు దూర్చారో? లేక తనే దూరారో కానీ, మొత్తం మీద ఆయన వ్యవహారం అంతా ఈ టోటల్ ఎపిసోడ్ కు దూరంగా నడుస్తోంది. ప్రకాష్ రాజ్ వెనుక మెగా వర్గం వుంది. కానీ నరేష్ వర్గం విష్ణు వెనుక వుంటుందా అన్నది అనుమానంగా వుంది. ఎందుకంటే నరేష్ వర్గం చాలా చీలికలు అవుతోంది. జీవిత ఒకవైపు, మిగిలిన వారు తలావైపు వుంటున్నారు.
నిజానికి నరేష్ ను నమ్ముకుని విష్ణు రంగంలోకి దిగి పొరపాటు చేసారా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ టీమ్ అన్ని మద్దతులు సమకూర్చుకుని ఆపై ఎన్నికల డిమాండ్ దిశగా నడుస్తోంది. నరేష్ మాత్రం తను ఎలాగూ పోటీ లో లేరు అని కేవలం కమిటీని కొనసాగించే ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో విష్ణు వ్యూహం ఏమిటో తెలియాల్సి వుంది.
నిజానికి ఏకగ్రీవం అయితే తాను తప్పుకుంటా అని చెప్పడం ద్వారా విష్ణు మంచి మాట అనడమే కాదు, తానేమీ పోటీకి పట్టుదలగా లేరు అనే మెసేజ్ ను పంపినట్లు అయింది. కానీ సమస్య ఏమిటంటే ఇప్పుడు వెనక్కు తగ్గడానికి అవకాశం కనిపించడం లేదు.
ఆ అవకాశాన్ని, చాలా స్మూత్ గా మెగా క్యాంప్ కనుక కల్పించినట్లు అయితే పోటీ నుంచి విష్ణు వెనక్కు తగ్గే సూచనలు వున్నాయి. కానీ అలా జరగాలంటే ప్రకాష్ రాజ్ పోటీలో వుంటే సాధ్యం కాదు. కానీ ఇది మెగా క్యాంప్ కు సాధ్యం కాదు.
మొత్తం మీద నరేష్-మెగా క్యాంప్ నడుమ జరుగుతున్న రాజకీయంలో విష్ణు ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది.