అన్న మెగాస్టార్ లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తమ్ముడు పవర్ స్టార్ అయ్యప్పన్ కోషియమ్ ను రీమేక్ చేస్తున్నారు. రెండు లాస్ట్ ఇయర్ మలయాళంలో హిట్ అయిన సినిమాలే. అయితే గమ్మత్తుగా ఈ రెండూ తెలుగు మాస్ సినిమాల టైపు కాదు. కానీ రెండింటిలో హీరోయిజం పుష్కలంగా వుంటుంది. అలా అని హీరోయిన్లను వెంటేసుకుని డ్యూయట్లు పాడే టైపు సినిమాలు కావు.
కానీ రెండు సినిమాలు తెలుగులోకి వచ్చేసరికి వారి స్వభావ స్వరూపాలు పూర్తిగా మారిపోతున్నాయి. మెగా హీరోలకు సరిపడే విధంగా, మెగా ఫ్యాన్స్ కు నచ్చే విధంగా కథలను మార్చేస్తున్నారు.
అయ్యప్పన్ కోషియమ్ స్క్రిప్ట్ ను దర్శకుడు త్రివిక్రమ్ తయారు చేసారు. డైలాగ్ వెర్షన్ కూడా ఆయనదే. యాభై ఏళ్ల హీరో పాత్రను నలభై ఏళ్ల లోపులోకి లాగేసారు. కామెడీ పండించడానికి సపోర్టింగ్ క్యారెక్టర్ల నిడివి పెంచారు. అలాగే పవన్ కు భారీ ఫైట్లు యాడ్ చేసారు. ఇక పాటల సంగతి సరేసరి.
లూసిఫర్ రీమేక్ విషయానికి వస్తే కథను తెలుగుకు, మెగా స్టార్ కు అనుకూలంగా మార్చడానికి చాలా మంది ట్రయ్ చేసారు. ఆఖరికి ఆ విషయంలో మోహన్ రాజా మెప్పించారు. దాంతో ఈ సినిమా ఆగస్టు 13 నుంచి పట్టాలు ఎక్కబోతోంది.
మలయాళం నుంచి జస్ట్ లైన్ మాత్రం తీసుకుని మొత్తం మార్చేసారని తెలుస్తోంది. రెండవ హీరో పృధ్వీరాజ్ క్యారెక్టర్ నే సినిమాలో వుండదని బోగట్టా. అంతే కాదు మాంచి యాక్షన్ సీన్లు కూడా జోడించారు.
మొత్తం మీద మలయాళం సినిమాలు చూసి ఆనందించిన వారు ఈ రీమేక్ సినిమాలు చూసి ఎలా ఫీలవుతారో చూడాలి.