మన సిస్టం ఎలా వుందంటే, దాన్ని నడుపుతున్న వాళ్లకే నమ్మకం లేని స్థితి. ఈ మధ్య నిమ్స్ డైరెక్టర్‌కి అనారోగ్యమైతే అపోలో ఆస్పత్రిలో చేరాడు. నిమ్స్ చాలా పేరు ప్రఖ్యాతలున్న ఆస్పత్రి. అయితే అక్కడ ఏం సదుపాయాలున్నాయో డైరెక్టర్ కంటే బాగా తెలిసిన వాళ్లు ఎవరుంటారు? అందుకే రిస్క్ తీసుకోలేదు. ఈ విషయాన్ని గవర్నర్ తమిళిసై ప్రస్తావిస్తే ఢిల్లీలో ఎయిమ్స్ వున్నా కూడా అమిత్‌షా ప్రైవేట్ ఆస్పత్రిలో ఎందుకు చేరారని టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు.
అంతే తప్ప నిజంగా నిమ్స్‌లో సౌకర్యాలు, మంచి డాక్టర్లు ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోరు. అది వాళ్ల పనికాదు. విమర్శలకు ప్రతి విమర్శ చేయడమే రాజకీయం. వాస్తవాలు ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాస్పత్రులు ఉన్నది పేదల కోసం, డబ్బులు ఖర్చు చేయలేని వాళ్ల కోసం… నాయకుల కోసం కాదు. యోగాతో అన్ని రోగాలు నయమవుతాయని, ఆయుర్వేదం పేరుతో కోట్ల రూపాయలు వ్యాపారం చేసే రాందేవ్‌బాబాకి జబ్బు చేస్తే, ఇంగ్లీష్ వైద్యం వెళ్తాడు. ఇది రియాల్టీ.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన మంత్రులకి ఎవరికి జబ్బు చేసినా హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాలు ఉన్న రాష్ట్రంలో మంచి ఆస్పత్రులు లేవనే కదా అర్థం. కనీసం ప్రైవేట్ ఆస్పత్రులని కూడా మన నాయకులు నమ్మరు. నేరుగా హైదరాబాద్ వచ్చి అపోలో, యశోద అంటూ చేరిపోతారు. మాటలు చెప్పేది జనం కోసమే. తన దాకా వస్తే కథ వేరే!
ఐదేళ్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నాడు. మూడేళ్లుగా జగనూ చెబుతున్నాడు. మరి మన మంత్రికి జబ్బు చేస్తే హెలికాప్టర్లో హైదరాబాద్‌కి తరలించే పరిస్థితి ఎందుకు వుంది? అన్ని వైద్యకళాశాలలున్నాయి, అవన్నీ వేస్ట్ అని అర్థమా? అవి కేవలం పేదవాళ్లకి అని అర్థమా? మంత్రి కాబట్టి ఆకాశంలో తరలించారు. అదే పేదవాడైతే చచ్చిపోవాల్సిందే కదా! ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా! మంత్రుల్ని దేవుడు ప్రత్యేకంగా సృష్టిస్తాడా!
దిక్కు లేక, డబ్బులు లేక మన ప్రభుత్వ ఆస్పత్రులకి వెళ్లాల్సిందే కానీ, దాని మీద నమ్మకం వుండి కాదు. బ్రహ్మాండమైన వైద్య సౌకర్యాలు కలిగిస్తున్నామని మన నాయకులు కోతలు కోస్తూ వుంటారు. అదే నిజమైతే మన నాయకుల పిల్లలు కానీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు కానీ, మన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి పిల్లల్ని కనమనండి చూద్దాం!
అధికారులు కాదు, గుమాస్తాలు, సామాన్యులు కూడా మన మెటర్నిటీ ఆస్పత్రుల్ని నమ్మి తమ ఆడపిల్లల్ని అడ్మిట్ చేయడం లేదు. ఎందుకంటే భయం. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. అందుకని జబ్బులొస్తే అప్పులపాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ వుంది కదా అంటే అన్ని జబ్బులు దాని కిందికి వస్తాయా?
ఈ మధ్య ఒకావిడ జ్వరం వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితో ప్లేట్లెట్స్ అని రూ.20 వేలు బిల్లు చేసారు. అమ్మ ఒడికి వచ్చిన రూ.13 వేలు పోగా రూ.7 వేలు అప్పు చేసింది. అంటే జగనన్న ఆమెకి రూ.7 వేలు బాకీ. ప్రభుత్వ ఆస్పత్రిలో ధైర్యంగా చేరే నమ్మకం, భరోసా కల్పించకపోవడం వల్ల జగన్ ఆమెకి బాకీ. అయినా నాయకులకే (కనీసం కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు కూడా) గవర్నమెంట్ ఆస్పత్రుల మీద నమ్మకం లేనప్పుడు, సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది?
జీఆర్ మహర్షి