మనకు కొన్ని అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలుంటాయి. అయితే నలుగురిలో వున్నపుడు,, ఇతరులకి ఇబ్బంది లేకుండా ప్రవర్తించడం సంస్కారం. ఇంట్లో వున్నపుడు లుంగీ, బనీయన్‌తో వుంటాం. పెళ్లికి వెళితే అలాగే వెళ్లం కదా! నేనింతే, ఇంట్లో ఎలా వుంటానో, బయట కూడా అంతే అంటే అందరూ నవ్వుతారు. మన దగ్గరికి రావడానికి భయపడతారు.
బిగ్‌బాస్ హౌస్‌లో గీతూ వ్యవహారం కూడా ఇలాగే వుంది. యూట్యూబ్‌లో గలాటు గీతుగా పేరు పొందిన గీతూ, హౌస్‌లో మంచి వినోదం పంచుతుందని ఆశిస్తే గలాట మాత్రమే చేసి హౌస్‌లో వున్నవాళ్లకే కాదు, ప్రేక్షకులకి కూడా రోత పుట్టిస్తూ వుంది. పెద్ద గొంతుతో అరుస్తూ, నాకు ఫేక్‌గా వుండడం రాదు, లోపల ఏముంటే అది అనేస్తా. ఇలా తనను తాను ఫెయిర్ అని వాదిస్తూ వుంది.
అడ్డదిడ్డంగా మాట్లాడ్డం ఓ జబ్బు. వీళ్లు తమని తాము గొప్పగా ఊహించుకుంటూ, అందరూ తాము చెప్పేది వినాలని, తాము కరెక్ట్‌గా మాట్లాడ్తామని వాదిస్తూ వుంటారు. స్కూల్లో కూడా తనంటే ఎవరికీ ఇష్టం వుండేది కాదని గీతూనే చెప్పింది. నోటికి వచ్చింది మాట్లాడే వాళ్లని ఎవరు మాత్రం భరిస్తారు? అందుకే వరస్ట్ ఫర్‌ఫార్మర్‌గా హౌస్‌లో మెజార్టీ సభ్యులు గీతూని సెలెక్ట్ చేశారు. ఆమె అర్హురాలు కూడా!
గీతూ కొంత కాలం సాఫ్ట్వేర్ జాబ్ చేసింది. తాను ఫేక్‌గా వుండనని చెప్పుకునే గీతూకి చాలా సార్లు జాబ్‌లో తన బాస్‌ని తిట్టాలని, తన్నాలని అనిపించే వుంటుంది. అలా చేయకుండా కంట్రోల్ చేసుకుంటేనే రెండేళ్లు జాబ్ చేసి వుంటుంది. లేదంటే మరుసటి రోజే పంపించే వాళ్లు.
గతంలో తమన్నా అని ఒకావిడ రెండు వారాల్లోనే ప్రేక్షకుల్ని భయపెట్టింది. అంత కాదు కానీ, ప్రవర్తన మార్చుకోకపోతే గీతూ కూడా కనిపించినా, వినిపించినా జనం భయపడే స్థితి వస్తుంది.
గీతూ అహంకారానికీ, మూర్ఖత్వానికీ పరాకాష్ట, బాలాదిత్య ముఖానికి కాలు పెట్టి ఊపడం. కాలు మీద కాలు వేసుకోవడం, కాలు ఊపే అలవాటు చాలా మందికి వుంటుంది. తప్పు లేదు. అయితే పెద్దవాళ్ల ముందు అలా ప్రవర్తించం. ముఖానికి కాలు పెట్టి ఎవరి ముందూ ఊపం. అది అమర్యాద. నలుగురిలో మనం ఎలా వుంటామో, అదే మన బిహేవియర్. గీతూకి అదంతా లేదు. ఆదిత్య చెప్పినా వినకుండా రెండోసారి కాలు ఊపడం దటీజ్ గీతూ.
టాస్క్‌లో అమ్మాయిలతో కలిసి ఆడినా, ఆటలో చేతులు తగులుతాయి తప్ప ఉద్దేశ పూర్వకంగా ఎవరూ పట్టుకోరు. అన్ని సీజన్లలో సభ్యులు ఇది పాటించారు. తేడా వస్తే నాగార్జున క్లాస్ పీకి వీడియో చూపిస్తాడు. గీతూ ఏం చేసిందంటే టాస్క్‌లో తాళాన్ని టీ షర్ట్‌లో వేసుకుంది. ఇది కరెక్ట్ కాదని చెబితే, నేను ఇంతే, ఎవరైనా చెయ్యి పెట్టి తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పింది. ఎవరు మాత్రం ఏం చేస్తారు?
మీరెవరూ నాకు ఫ్యామిలీ కాదు, ఎమోషన్స్ లేవు, గేమ్ ఆడడానికి వచ్చాను అనడం కొంత వరకూ కరెక్ట్. ఎంత గేమ్ అయినా కొన్ని రూల్స్ వుంటాయి. నాలుగు రోజులకే చూసే వాళ్లకి విసుగొస్తే, వుండేవాళ్ల పరిస్థితి ఏంటి? ఇదంతా స్ట్రాటజీ అనుకోడానికి వీల్లేదు. ఆమె స్టైల్ అది. టాలెంట్ వేరు, పర్సనాలిటీ వేరు అని రేవంత్ గురించి గీతూనే చెప్పింది. ఇది రేవంత్ కంటే గీతూకే వర్తిస్తుంది.
తాను బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు నాగార్జునతో చెప్పింది. తగ్గించుకోవాల్సింది బరువు కాదు, అహంకారం.