కేరవాన్.. వానిటీ వ్యాన్.. పేరు ఏదైనా, ప్యాలస్ ఆన్ వీల్స్ అన్నమాట. మనం వున్నచోటే విలాసవంతమైన మన గెస్ట్ హవుస్ అని కూడా అనుకోవచ్చు. హీరోలు, నటులు అందరూ ఒకప్పుడు షూటింగ్ కు వస్తే చెట్టునీడనే కూర్చునేవారు. రాను రాను కేరవాన్ వాహనాలు వచ్చాయి. ఓ బస్ లేదా వ్యాన్ ను రెండు గదులుగా మార్చి, ఆ గదిలో చిన్న బెడ్, టాయ్ లెట్, మేకప్ డెస్క్ సమకూర్చడం ప్రారంభమైంది. ఇప్పటికీ నటులకు చాలా మందికి ఇలాంటి కేరవాన్ లే సమకూర్చుతున్నారు. వీటి అద్దె రోజుకు అయిదు నుంచి ఏడు వేలు వుంటుంది.
అయితే బాలీవుడ్ హీరోలు స్వంత వానిటీ వ్యాన్ లు తయారుచేయించుకోవడం ప్రారంభించారు. మన హీరోలు కూడా ఇదేబాట పట్టారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ క్యారవాన్ లు తయారుచేయించుకుంటున్నారు. ఇప్పటికే టాప్ స్టార్ లు ఎన్టీఆర్, మహేష్ బాబు తదితరులకు విలాసవంతమైన స్వంత కేరవాన్ లు వున్నాయి. స్టయిలిష్ స్టార్ బన్నీ కూడా ఇప్పుడు ఓ అత్యంత విలాసవంతమైన వానిటీ వ్యాన్ ను సమకూర్చుకున్నాడు.
ఈ వానిటీ వ్యాన్ పేరు ఫాల్కన్. మహరాష్ట్రలోని రెడ్డి కస్టమ్స్ అనే సంస్థ ఈ ఫాల్కన్ వ్యాన్ ను అల్లుఅర్జున్ అభిరుచికి తగినట్లు తయారుచేసింది. సుమారు ఆరేడు కోట్లు ఈ వ్యాన్ కు, దాని మోడిఫికేషన్ కు ఖర్చయినట్లు బోగట్టా. ఈ వ్యాన్ లో ప్రతి ఫర్నిచర్ అత్యంత విలాసవంతమైనది. డ్రాయింగ్ రూమ్, రెస్ట్ రూమ్, టాయిలట్స్, స్క్రిప్ట్ డిస్కషన్ ఏరియా, ఇలా దేనికదే ప్రత్యేకతగా వుంటాయి.
వ్యాన్ మీద బన్నీ సిగ్నేచర్ అన్నట్లుగా ఎఎ అనే పేరు స్టయిల్ గా డిజైన్ చేసి వుంటుంది. మొత్తం వ్యాన్ బ్లాక్ కలర్ లో వుంటుంది. లోపల ఖరీదైన రిక్లయినర్లు, బిగ్ స్క్రీన్ టీవీలు, పవర్ ఫుల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ వ్యవస్థ వుంటాయి. ఇప్పుడు బన్నీ షూట్ ఎక్కడ వున్నా ఈ వ్యాన్ అక్కడ వుంటుంది. ఈ వ్యాన్ ఎక్కడ వుంటే బన్నీ షూటింగ్ అక్కడవున్నట్లే.