క‌ర్ణాట‌క‌లో బీజేపీ తొంద‌ర‌ప‌డిందా?

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి హోదాకు య‌డియూర‌ప్ప త‌న రాజీనామాను ప్ర‌క‌టించి ఒక రోజు గ‌డిచి పోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే అంశంపై బీజేపీ హైక‌మాండ్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. మీడియాలో ఈ…

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి హోదాకు య‌డియూర‌ప్ప త‌న రాజీనామాను ప్ర‌క‌టించి ఒక రోజు గ‌డిచి పోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే అంశంపై బీజేపీ హైక‌మాండ్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. మీడియాలో ఈ అంశంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. ఎనిమిది పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. వారిలో న‌లుగురు లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు, ఇద్ద‌రు వ‌క్క‌లిగ‌లు, మ‌రో ఇద్ద‌రు బ్ర‌హ్మ‌ణులు. వీరిలో ఎవ‌రి అవ‌కాశాలు ఎంత అనే అంశంపై మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీరిలో కేవ‌లం రెండోసారి ఎమ్మెల్యే అయిన వారూ ఉన్నారు. అలాగే వ్యాపారాల‌తో బిజీగా ఉన్న నేత ఒక‌రు, మ‌రో ఇద్ద‌రు ప్ర‌జ‌ల‌తో డైరెక్టు సంబంధాలు లేని వారు! వారంతా ఢిల్లీలో నేత‌లు, అధికార ప్ర‌తినిధులు మాత్ర‌మే. ప్ర‌జ‌ల నుంచి నెగ్గి వ‌చ్చిన నేప‌థ్యం లేదు. అలాంటి వారిని ముఖ్య‌మంత్రులుగా చేస్తే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడా ఏ మేర‌కు ల‌భిస్తుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కం.

అన్నింటికీ మించి త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే అంశం పై పూర్తి స్థాయిలో ఒక అభిప్రాయానికి రాక‌ముందే య‌డియూర‌ప్ప చేత రాజీనామా చేయించార‌నే స్ప‌ష్ట‌త వ‌స్తోంది. క‌న్నీటితో, భావోద్వేగంతో య‌డియూర‌ప్ప రాజీనామా ప్ర‌క‌ట‌న చేశారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి త‌న రాజీనామా ప‌త్రాన్ని ఇచ్చారు. త‌దుప‌రి ఏర్పాట్లు జ‌రిగే వ‌ర‌కూ కేర్ టేక‌ర్ గా ఉండాలంటూ య‌డియూర‌ప్ప‌ను కోరార‌ట గ‌వ‌ర్న‌ర్.

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌ర్ణాట‌క బీజేపీ ఎమ్మెల్యేల స‌మావేశం జ‌ర‌గ‌లేదు. అది జ‌రిగిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి ఎవ‌రో తేలుతుంద‌ని బీజేపీ నేత‌లు ప్ర‌క‌టిస్తున్నారు. కానీ సీల్డ్ క‌వ‌ర్ ముఖ్య‌మంత్రే వ‌స్తార‌ని, అధిష్టానం చెప్పిన పేరునే బీజేఎల్పీ మీటింగులో ముఖ్య‌మంత్రిగా ఎన్నుకుంటార‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ సీల్డ్ క‌వ‌ర్లో ఉంచ‌డానికి త‌గిన పేరును కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ రెడీ చేయ‌లేక‌పోయింద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఏకంగా ఎనిమిది పేర్ల‌తో ఊహాగానాలు కొన‌సాగుతూ ఉన్నాయి. అది కూడా ఒక మాస్ లీడ‌ర్ ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయించి, అలాంటి లీడ‌ర్ ను కాకుండా వేరే త‌ర‌హా వాళ్ల‌ను ఆ హోదాలోకి ఎంపిక చేస్తూ.. ఆ విష‌యంలో కూడా రాజీనామా త‌ర్వాత కూడా స్ప‌ష్ట‌త‌కు రాన‌ట్టుగా ఉంది బీజేపీ అధిష్టానం.