తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్టీపీ అనే పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల అరుదైన ఘనత సాధించారు. తెలంగాణలో 3,800 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణలోని సమస్యలను తెలుసుకునేందుకు ఆమె పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.
2021, అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఏడాదిన్నర పాటు ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అవాంతరాలను సృష్టించింది. అయినప్పటికీ ఆమె పాదయాత్ర ముందుకు సాగింది. అయితే వివాదాస్పద, వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారనే కారణంతో ఆమె పాదయాత్ర అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. చివరికి న్యాయపోరాటం చేసి అనుమతి తెచ్చుకున్నప్పటికీ, అనుకున్న ప్రకారం పాదయాత్ర సాగలేదు.
గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల అన్న కోసం పాదయాత్ర చేశారు. తెలంగాణలో మాత్రం తన కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి అక్కడి ప్రజానీకం ఆదరణ చూరగొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అరుదైన ఘనత సాధించిన షర్మిలను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కలిసి అవార్డు ప్రదానం చేయడం విశేషం.
త్వరలో ఆమె పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ తరుణంలో పాదయాత్రకు అవార్డు దక్కడం షర్మిలకు సంతోషాన్ని ఇచ్చేదే.