‘ఆలూ లేదు చూలూలేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయం. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ఆయన ఉబలాటపడుతున్నారే తప్ప.. ఇప్పటిదాకా ఆయనకు ఇతర జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల పార్టీల నుంచి ఎంత సంపూర్ణమైన మద్దతు లభించింది అనే సంగతి స్పష్టత లేదు.
తొలి నుంచి దేశంలోని భాజపాయేతర పార్టీలు అన్నిటినీ కూడగట్టడం కోసమే కాలికి బలపం కట్టుకుని తిరిగిన కేసీఆర్.. ఆ తర్వాత సొంతంగా జాతీయ పార్టీని స్థాపించడానికి పూనుకోవడం చూస్తే ఆయనకు ఇతరుల మద్దతు పెద్దగా లభించలేదని మనకు అర్థమవుతుంది.
ఆ రకంగా జాతీయ రాజకీయాలలో ఆయనకు ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఇంకా అడుగులు సవ్యంగా పడనేలేదు. అయితే అప్పుడే .. దేశానికి కేసీఆర్ ఒక్క ఐదేళ్లు ప్రధానిగా పనిచేస్తే చాలు దేశం ముఖచిత్రం మొత్తం రూపు మారిపోతుంది అనే అతిశయమైన డైలాగులతో ఆయన పార్టీ నాయకులు చర్చలు లేవదీస్తున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. కెసిఆర్ దేశం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా… ప్రధాని పదవి మీద ఆశతో ఈ ఎత్తుగడ వేస్తున్నారా అని అనుమానాలను ప్రజల్లో పుట్టిస్తున్నారు.
ఇప్పటిదాకా జాతీయ స్థాయి ఇతర నాయకులు కేసీఆర్ ప్రాధాన్యాన్ని పెద్దగా గుర్తించడం లేదు. రెండు రోజుల కిందట మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడు కూడా నితీష్ కుమార్, శరద్ పవార్ పేర్లను ప్రస్తావించారే తప్ప కెసిఆర్ ఊసెత్తలేదు.
చూడబోతే మనకు అర్థమవుతున్నది ఏంటంటే.. కెసిఆర్ కలగంటున్న కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు.
కెసిఆర్ ఒక కూటమికి కీలకంగా వ్యవహరించినంత మాత్రాన.. ఆయన ప్రధాని కాగలరని ఆయన అనుచరులు ఎలా అనుకుంటున్నారో మనకు బోధపడదు. నూటికి నూరు శాతం సీట్లు గెలిచినా సరే కేవలం 17 మంది ఎంపీలకు నాయకుడిగా ఆయన పార్లమెంటులో అడుగు పెడతారు.
మోడీ వ్యతిరేక పార్టీలలో ఇంకా అనేకమంది సీనియర్ నాయకులు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎంపీల బలంతో ఉండగల అవకాశం మెండుగా ఉంది. వారందరినీ కాదని కెసిఆర్ ను ప్రధాని కుర్చీ ఎలా వరిస్తుంది. ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న.
కెసిఆర్ ఒకవేళ జాతీయ పార్టీని ప్రారంభించి దూసుకెళ్లినా సరే.. ఇతర రాష్ట్రాలలో ఎంపీ సీటు గెలవగలిగేంత ఎలా ప్రభావం చూపగలరు? చివరికి మజ్లీస్ అధినేత ఓవైసీ అయినా సరే ఇతర రాష్ట్రాలలో ముస్లిం ప్రాబల్యం బాగా ఉన్నచోట ఒక సొంత ఎమ్మెల్యేని, ఎంపీ ని గెలిపించుకోగలరు గాని… ఏ ప్రాతిపదిక మీద కేసీఆర్ ఇతర ప్రాంతాలలో తన జాతీయ పార్టీ తరఫున సొంతంగా ఎంపీలను గెలిపించుకోగలరు అనేది పలువురి సందేహం.
ఇతర రాష్ట్రాలలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని తన జాతీయ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించే ఆలోచన ఉన్నట్లయితే.. అది ఏ మేరకు సాధ్యమవుతుందో ఎవరికి అంతుబట్టడం లేదు.
ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తూ.. కెసిఆర్ ఈ దేశానికి ప్రధాని కావాల్సిందేనని అతి భక్తితో వ్యాఖ్యలు చేస్తున్న తెరాస నాయకులు చాలా విషయాలను విస్మరిస్తున్నారు.
నితీష్, శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా ఇప్పటిదాకా ప్రధాని పదవి పై తమ ఆశను బయట పెట్టడం లేదు. అలాంటిది ఆలుచూలు లేకుండానే ప్రధాని అయిపోతానని కేసీఆర్ అనుచరులతో మాటలు చెప్పిస్తే.. వాళ్లు ఊరుకుంటారా! కెసిఆర్ ను దూరం పెట్టాలని అనుకుంటే ఆయన ఆశలు ఏమవుతాయి? ఇవన్నీ కూడా ఆయన భజన చేస్తున్న పార్టీ నాయకులు ముందుగా ఆలోచించుకోవాలి.