Advertisement

Advertisement


Home > Politics - Gossip

బిజెపి అలర్ట్: చిన్నమ్మ చంద్రబాబు కోవర్టా?

బిజెపి అలర్ట్: చిన్నమ్మ చంద్రబాబు కోవర్టా?

ఎన్టీరామారావు కూతురిగా కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రవేశించి, కేంద్రమంత్రి స్థాయి పెద్దపెద్ద పదవులు అధిష్టించి.. ప్రస్తుతం కమలదళంలో ప్రస్థానం కొనసాగిస్తున్న చిన్నమ్మ- దగ్గుబాటి పురందేశ్వరి- చంద్రబాబునాయుడు కోవర్టు అనే అనుమానం భారతీయ జనతా పార్టీకి కలిగిందా?

కమ్మ కుల సమీకరణాలు, అవకాశవాద బంధు సమీకరణాల కోణంలోంచి ఆమె నెమ్మదిగా ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశానికి దగ్గరవుతోందనే అనుమానం వారికి కలిగిందా? అనే  ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది.

బిజెపిలో జాతీయ స్థాయిలో కీలక పదవులు, గౌరవం అనుభవిస్తున్న పురందేశ్వరికి ఆమె పార్టీ బాధ్యతల్లో కోతపెట్టడమే.. బిజెపి జాగ్రత్త పడుతుండడానికి కారణంగా పలువురు విశ్లేసిస్తున్నారు. ఆమె మీద నమ్మకం పోయిందని, చంద్రబాబు కోవర్టుగా , టీడీపీతో కలిసిపోబోయే నాయకురాలిగా పార్టీ అనుమానిస్తోందని పలువురు అంటున్నారు. 

పురందేశ్వరి ఒరిస్సా రాష్ట్ర బిజెపి ఇన్చార్జిగా ఉండగా ఆ బాధ్యతల నుంచి గతనెలలో ఆమెను తొలగించారు. అలాగే ఛత్తీస్ గఢ్ కూడా ఆమె ఇన్చార్జిగా ఉండేవారు. ఆ బాధ్యతలనుంచి కూడా తప్పించి.. పార్టీ సహఇన్చార్జి బాధ్యతలకు పరిమితం చేశారు. గతంలోనే ఆమెను పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ బాధ్యతలనుంచి కూడా తప్పించిన సంగతి పలువురికి గుర్తుండేఉంటుంది. 

పురందేశ్వరి వలన పార్టీకి ఒరుగుతున్నది ఏమీ లేదని పార్టీ అధినాయకత్వం గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపిని ఏపీ రాజకీయాల్లో బలోపేతం చేయడంపై ఆమె ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని వారు గుస్సాగా ఉన్నారు. 

ఎన్టీఆర్ కుమార్తె అనేదే అతిపెద్ద అర్హతగా దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా వైభోగం వెలగబెడుతూ.. ప్రతిభాశీలి అయిన మంత్రిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

ఆమె ప్రతిభ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ కూతురుగా ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదరణ ఉంటుందని, బిజెపిని బలోపేతం చేయడానికి ప్రయత్నించేప్పుడు.. తెలుగుదేశం పార్టీనుంచి ఎన్టీఆర్ అభిమానుల్ని వలసలుగా కమలదళంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని వారు భావించారు. అయితే ఆమె ఎన్నికల్లో కనీసం ఎంపీగా కూడా గెలవలేకపోయారు. ఇప్పటిదాకా టీడీపీనుంచి ఒక్కరినైనా పార్టీలోకి తేలకపోయారు. 

కేవలం వలసల మీద ఆశతోనే.. పురందేశ్వరి అధ్యక్షతన ఏపీలో విస్తృత చేరికల కమిటీని బిజెపి ఏర్పాటుచేసింది. ఆ రకంగా ఆమెకు చాలా పెద్ద ప్రాధాన్యం కట్టబెట్టినట్టు లెక్క. అయితే అమిత్ షా స్వయంగా చెప్పినా కూడా.. ఆమె తన అధ్యక్షతన ఏర్పాటు అయిన విస్తృత చేరికల కమిటీ సమావేశాన్ని ఒక్కసారి కూడా నిర్వహించనే లేదు. దాంతో భాజపా ఆగ్రహించింది.

ఆమె వలన పార్టీలోకి వలసలు ఉంటాయని ఆశిస్తే.. ఆమె పూర్తిగా తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడడానికే పనిచేస్తోందనే అభిప్రాయం వారికి కలిగిందని సమాచారం. 

పైగా పురందేశ్వరి క్రమంగా తెలుగుదేశానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి గుర్తించింది. ఆమె బిజెపిలో ఉన్నప్పటికీ ఆమె కుటుంబం గత ఎన్నికల సమయానికి వైసీపీలో ఉన్నారు. ఈసారి వారు టీడీపీ తరఫున పోటీచేస్తారని ఒక ప్రచారం ఉంది. ఇదంతా కలిసి.. పురందేశ్వరి పార్టీకి వీసమెత్తు ఉపయోగపడకపోగా.. తన హోదాలకు పార్టీని మాత్రం వాడుకుంటున్నారనే అభిప్రాయానికి బిజెపి వచ్చినట్టు తెలుస్తోంది.

అందుకే ఆమెకున్న పదవులన్నిటికీ నెమ్మదిగా కోతపెట్టి ప్రస్తుతానికి నామమాత్రంగా చేసేశారు. మరి పురందేశ్వరి తన భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక ఏం చేయగలదో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?