Advertisement

Advertisement


Home > Movies - Reviews

Brahmastra Review: మూవీ రివ్యూ: బ్రహ్మాస్త్ర

Brahmastra Review: మూవీ రివ్యూ: బ్రహ్మాస్త్ర

టైటిల్: బ్రహ్మాస్త్ర
రేటింగ్: 2.5/5
తారాగణం: రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్, షారుఖ్ ఖాన్ తదితరులు
సంగీతం: ప్రీతం
కెమెరా: మణికందన్
ఎడిటర్: ప్రకాష్ కురుప్
నిర్మాతలు: కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అపూర్వ మెహతా
దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2022

విస్తృతంగా ప్రచారం జరుపుకుంటూ, క్రమంగా అంచనాలు పెంచుతూ వచ్చిన చిత్రం "బ్రహ్మాస్త్ర". 

హాలీవుడ్లో ఎవెంజెర్స్ సిరీస్ ఎలాగైతే ప్రపంచాన్ని ఊపేసిందో ఆ స్థాయిలో దేశీ పద్ధతిలో హిందూ పురాణాల్లోని అస్త్రాల పేర్లను ప్రస్తావిస్తూ తీసిన సూపర్ హీరోస్ చిత్రమిది. 

అయితే దీనికి టార్గెట్ ప్రేక్షకులు ఎవరు? 
అనుకున్నది సాధించారా? 
పబ్లిసిటీకి తగ్గ విషయం ఉందా? 
చూద్దాం. 

వానరాస్త్ర శక్తితో ఒక సైంటిష్ట్ (షారుఖ్ ఖాన్) ప్రత్యర్థులతో భీకర పోరాటం...మరో పక్క శివ అనబడే యువకుడు ఒక గుడికి రావడం, అక్కడ ఇషా అనే అమ్మాయిని చూసి మనసుపడడం- ఇలాంటి సన్నివేశాలతో చిత్రం మొదలవుతుంది. 

క్రమంగా ఇతర పాత్రలు, వారికున్న శక్తులు పరిచయమవుతుంటాయి. ఎవరు ఏమిటో తెలుసుకునే లోపే యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అంతా గ్రాఫిక్స్ మాయాజాలమే. ఇదంతా ఎవెంజెర్స్ ఫార్మాట్. విజువల్ కే ప్రాధాన్యం, గ్రాఫిక్స్ వండర్ చూపించడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ఉంటుంది తప్ప ఆర్గానిక్ గా కథ నడుస్తున్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే పాత్రలకున్న అతీత శక్తులు అలాంటివి. 

ఒకానొక అస్త్రం ముక్కలుగా మారి ఒక్కో ముక్క ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. అవన్నీ ఎక్కడున్నాయో వెతికి పట్టుకుని ఒకటిగా చేస్తే అదొక సంపూర్ణ అస్త్రమవుతుంది. కథంతా దాని మీదే నడుస్తుంది. సరిగ్గా మొన్నీమధ్య చూసిన "కార్తికేయ-2" కూడా ఇలాంటిదే. 

ఎంత ఖర్చుపెట్టి తీసినా, గ్రాఫిక్స్ తో ఎలాంటి అద్భుతరసం పండించినా హ్యూమన్ ఎమోషన్స్ కి పెద్దపీట వేయకపోతే ఏ సినిమా కూడా నిలబడదు. ఇందులో లవ్ ట్రాక్ చాలా పేలవంగా ఉంది, ఎమోషన్ కూడా పలకలేదు ఎక్కడా! దీని వల్ల ఈ సినిమా ఇంకెప్పుడౌతుందా అని వాచీలకేసి చూసుకునే పరిస్థితి కలుగుతుంది. 

అలంకరణ మీద శ్రద్ధ పెట్టి అసలు వస్త్రం మరిచిపోయినట్టు, గ్రాఫిక్స్ మీద దృష్టి పెట్టి కథని గాలికొదిలేసినట్టయ్యింది. కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితి కూడా నెలకొంటుంది. దేవ్ అని ఒక పాత్ర వస్తుంది. దానికొక ముగింపు లేదు. అంటే సీక్వెల్ కూడా అట్టేపెట్టారన్న మాట. 

పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ సాగే ఈ కథకి మైనస్ ఏంటంటే చివరి అరగంట పడిపోవడం. సినిమా అంతా ఎలా ఉన్నా లాస్ట్ మొమెంట్స్ పైకి లేచినప్పుడే ప్రేక్షకులు సంతృప్తిగా సీట్లలోంచి పైకి లేస్తారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. 

నటీనటులు పాపులర్ కాబట్టి వాళ్లని చూస్తూ భరించాలంతే. కథ సంగతి పక్కన పెట్టి చూస్తే నిజజీవితంలో భార్యాభర్తలైన ఆలియా- రణబీర్ జంట తెర మీద ఒక ప్రత్యేక ఆకర్షణ. షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించినా కీలకమైన పాత్ర అది. నాగార్జున, అమితాబ్ ట్రాకులు ఆకట్టుకుంటాయి. ఆలియాకి చేయడానికేం లేదు. లేడీ విలన్ గా మౌనీ రాయ్ గుర్తుంటుంది. 

ఈ సినిమా గురించి ఏమన్నా చెప్పుకోవాలంటే టెక్నికల్ అంశాలే. మోయలేనన్ని భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలతో నిండిపోయిన చిత్రమిది. 

విజువల్ గా బాగున్నా చెవులకి అనందాన్నిచ్చే డయలాగ్స్ లేనే లేవు. ఇంత పేలవమైన రచన ఈ మధ్యకాలంలో లేదనిపిస్తుంది. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ కత్తెరకు పదును లేదు. కనీసం పావుగంటైనా కోసుండాల్సింది. 

తెర మీద ఫైటింగులు మాత్రమే ఇష్టపడే యూత్ కి, గంటల తరబడి వీడియో గేంస్ ఆడే పిల్లలని, లేదా ఆ స్థాయి బ్రెయిన్స్ ప్రేక్షకులని ఎంగేజ్ చేయగలదేమో తప్ప ఇతర ప్రేక్షకులకి ఇది ఆపసోపాలు తెప్పిస్తుంది. 

బాటం లైన్: గ్రాఫిక్స్ ప్రేమికులకి మాత్రమే

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను