ఒకవైపు తమతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. 16 మంది అని ఒకసారి కాదు 18 మంది తమతో టచ్లో ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీని భయపెడుతూ ఉంది బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్లి బీజేపీ నేతలతో సమావేశం అయ్యారంటే ఆయన గురించి అంతా ఏమనుకుంటారో వేరే చెప్పనక్కర్లేదు!
ఇదంతా తెలిసి కూడా వల్లభనేని వంశీ మోహన్ వెళ్లి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. దీంతో ఆయనపై అనుమానాలు మరింతగా పెరిగాయి. బీజేపీతో టచ్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో వంశీ కూడా ఒకరనే ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారంపై వంశీ రియాక్ట్ అయ్యారు. అవన్నీ అబద్ధాలని ఆయన చెప్పారు. తను కిషన్ రెడ్డితో సమావేశం అయ్యింది నిజమే అని, అయితే టీడీపీని మాత్రం వీడటంలేదని చెప్పుకొచ్చారు. అలాగే సుజనా చౌదరితో తన సంబంధాలు కొనసాగుతున్నాయని, అయినా కూడా తను బీజేపీలో చేరడంలేదని వంశీ విపులంగా చెప్పుకొచ్చారు. అనుమానాలను రేకెత్తిస్తూనే.. తనే ఖండిస్తూ ఉన్నారీయన!