జ‌గ‌న్‌కు ప్రొబేష‌న్ ప‌రీక్ష‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రొబేష‌న్ ప‌రీక్ష ఎదుర్కోనున్నారు. త‌న డ్రీమ్ ప్రాజెక్టు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలయాల వ్య‌వ‌స్థే ఆయ‌న‌కు ప్రొబేష‌న్ ప‌రీక్ష పెట్ట‌నుంది. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే చేసిన గొప్ప ప‌ని ఏదైనా ఉందా…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రొబేష‌న్ ప‌రీక్ష ఎదుర్కోనున్నారు. త‌న డ్రీమ్ ప్రాజెక్టు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలయాల వ్య‌వ‌స్థే ఆయ‌న‌కు ప్రొబేష‌న్ ప‌రీక్ష పెట్ట‌నుంది. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే చేసిన గొప్ప ప‌ని ఏదైనా ఉందా అంటే… గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ నెల‌కొల్ప‌డం. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం వ‌ల్ల ప్ర‌జానీకానికి ప్ర‌భుత్వం నుంచి సేవ‌లు త్వ‌రిత‌గ‌తిన అందుతున్నాయి.

అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా 1.21 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగాలు ద‌క్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో స‌చివాల‌య ఉద్యోగులు, వాలెంట‌ర్ల‌తో క‌లుపుకుంటే దాదాపు 4 ల‌క్ష‌ల మంది వివిధ ర‌కాల సేవ‌లందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 1.21 ల‌క్ష‌ల మంది స‌చివాల‌య ఉద్యోగులు ఈ ఏడాది అక్టోబ‌ర్ 2 నాటికి రెండేళ్లు స‌ర్వీసు పూర్తి చేసుకుంటారు. దీంతో వీరి ప్రొబేష‌న్ ఖ‌రారు చేసి శాశ్వ‌త ఉద్యోగులుగా ప్ర‌భుత్వం ప‌రిగ‌ణించాల్సి వుంది.

ఈ నేప‌థ్యంలో స‌చివాల‌య ఉద్యోగుల‌కు క్రెడిట్ బేస్డ్ అసెస్‌మెంట్ సిస్టం (సీబీఏసీ) పేరుతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు రాష్ట్ర‌ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల శాఖ స‌న్నాహాలు చేస్తోంది. సంబంధిత ఉద్యోగుల‌కు శాఖాప‌ర‌మైన అంశాల‌పై ఉన్న అవ‌గాహ‌నను తెలుసుకునేందుకు మ‌రో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. 

వంద మార్కుల‌కు రెండు ప‌రీక్ష‌లూ నిర్వ‌హించి, ఇందులో ఉత్తీర్ణ‌త సాధిం చిన వారికే ప్రొబేష‌న్ ఖ‌రారు చేస్తారనే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఇది స‌చివాల‌య ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న‌కు కార‌ణ‌మైంది. అపాయింట్‌మెంట్ లెట‌ర్‌లో ఈ విష‌యాన్ని పొందుప‌రిచిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది.

కానీ ప్రొబేష‌న్ ఖ‌రారు చేసేందుకు ఇలాంటి ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని నియామ‌కాల‌ప్పుడు త‌మ‌కు చెప్ప‌లేద‌ని స‌చివాల‌య ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రెండు ర‌కాల ప‌రీక్ష‌లు పెట్టాల‌నే ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై స‌చివాల‌య ఉద్యోగుల నేత‌లు అభ్యంత‌రం చెబుతున్నారు. ఈ అంశంపై సీఎం కార్యాల‌య అధికారుల‌తో నేడు (మంగ‌ళ‌వారం) స‌చివాల‌యాల శాఖ అధికారుల స‌మావేశంలో సానుకూల నిర్ణ‌యం వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు వారు చెబుతున్నారు. 

మ‌రోవైపు ఉద్యోగుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం కూడా ఒక మెట్టు కిందికి దిగింది. గ‌తంలో నిర్ణ‌యించిన సిల‌బ‌స్ చాలా ఎక్కువ‌గా ఉండింది. దాన్ని బాగా త‌గ్గించింది. అలాగే రెండు ప‌రీక్ష‌లకు బ‌దులు ఒక ప‌రీక్షే నిర్వ‌హిస్తే స‌రిపోతుంద‌నే అభిప్రాయంలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు స‌చివాల‌య ఉద్యోగుల్లోని గంద‌ర‌గోళాన్ని పోగొట్టేందుకు ప్ర‌భుత్వం ఇస్తున్న వివ‌ర‌ణ‌లు, చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదు. ఉద్యోగుల ప్రొబేష‌న్ ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాఖాప‌ర‌మైన ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించ‌నంత మాత్రాన స‌చివాల‌య ఉద్యోగుల‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండ‌ద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. 

స‌చివాల‌య ఉద్యోగుల‌ ఉద్యోగాలు పోవ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌పై అపోహ‌లు ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదని ఆయ‌న వాపోయారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకొచ్చిందే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అని చెప్పుకొచ్చారు. కానీ ప‌రీక్ష నిర్ణ‌యంతో వ్య‌తిరేక‌త‌ను ఎలా పోగొట్టుకోవాల‌నేది జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఓ ప్రొబేష‌న్ టెస్ట్ కావ‌డం గ‌మ‌నార్హం.