ఏపీలో ఉద్యోగుల వార్నింగ్ బెల్‌

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు మున్ముందు స‌మ‌ర‌శంఖం పూరించేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వార్నింగ్ బెల్ మోగించడాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించాల్సి వుంది. ఉద్యోగుల‌కు సంబంధించి చాలా హామీలు…

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు మున్ముందు స‌మ‌ర‌శంఖం పూరించేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వార్నింగ్ బెల్ మోగించడాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించాల్సి వుంది. ఉద్యోగుల‌కు సంబంధించి చాలా హామీలు నెర‌వేర్చాల్సి ఉంది. అలాగే వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సి వుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల‌తో డీఏలు, పీఆర్‌సీ త‌దిత‌ర విష‌యాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుకు పోలేని ప‌రిస్థితి.

ప్ర‌ధానంగా ఎన్నిక‌ల‌కు ముందు తాము అధికారంలోకి వ‌స్తే… వారంలోపు పాత పింఛ‌ను విధానాన్ని పున‌రుద్ధ‌రిస్తాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌యింది. అయిన‌ప్ప‌టికీ సీపీఎస్‌కు సంబంధించి ఎలాంటి పురోగ‌తి లేదు. ఈ ధోర‌ణి స‌హ‌జంగానే ఉద్యోగుల్లో అస‌హ‌నాన్ని పెంచుతోంది. సీపీఎస్ విష‌య‌మై జ‌గ‌న్ త‌న హామీని గుర్తు చేయ‌డంతో పాటు నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఉద్యోగులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

పాత పింఛ‌ను విధానాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతూ ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్  (ఏపీసీపీఎస్ఈఏ) ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించింది. త‌మ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఉద్యోగులు ఉద్య‌మ బాట‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్చు వ‌ల్‌గా జ‌రిగిన ఎంప్లాయీస్ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. సీపీఎస్ విధానాన్ని ర‌ద్దు చేయ‌కపోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆగ‌స్టు 1 నుంచి 7వ తేదీ వ‌ర‌కూ నిర‌స‌న వారోత్స‌వం నిర్వ‌హించున్నారు. ఈ విష‌యాన్ని సంఘం అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు రామాంజ‌నేయులు యాద‌వ్‌, ప‌ఠాన్ వెల్ల‌డించారు.

క్విట్ సీపీఎస్ పేరుతో ఆగ‌స్టు 8న శాస‌న‌స‌భ్యుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేస్తారు. 15న సోష‌ల్ మీడియా ద్వారా ముఖ్య‌మంత్రి, మంత్రులు, ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని ట్యాగ్ చేస్తూ సందేశాలు పంపిస్తారు. 16 నుంచి 21 వ‌ర‌కూ మ‌ధ్యాహ్నం వేళ‌ నిర‌స‌నలు చేప‌డతారు. సెప్టెంబ‌ర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో పింఛ‌ను విద్రోహ దినం-న‌య‌వంచ‌న స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ఉద్యోగులు నిర్ణయించ‌డం కీల‌క ప‌రిణామంగా చెప్పొచ్చు.

బ్రిటీష్ పాల‌కులు మ‌న దేశం నుంచి వెళ్లిపోవాలంటూ మ‌హాత్మాగాంధీజీ నేతృత్వంలో1942, ఆగ‌స్టు 8న చేప‌ట్టిన‌ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యోగులు క్విట్ సీపీఎస్ నినాదంతో ఉద్య‌మించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి క్విట్ సీపీఎస్ అనే నినాదంలో నిగూఢ‌మైన అర్థం దాగి ఉంది. ఒక‌వేళ హామీని నెర‌వేర్చ‌క‌పోతే …క్విట్ జ‌గ‌న్ అనేది ఆ నినాదంలోని ప‌ర‌మార్థంగా ఉద్యోగులు చెబుతున్నారు. సీపీఎస్ ర‌ద్దు చేయాల‌ని మొద‌ల‌య్యే పోరాటం… ఆ ఒక్క‌దానితోనే ఆగుతుంద‌ని చెప్ప‌లేమ‌ని ఉద్యోగులు అంటున్నారు.

స‌మస్య‌ల్లో ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి ఒక్కో అంశంపై నెమ్మ‌దిగా ఉద్య‌మించాల‌నే అభిప్రాయంలో ఉద్యోగులున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇప్ప టికే ఐదేళ్ల‌లో దాదాపు స‌గం ప‌రిపాల‌నా కాలాన్ని జ‌గ‌న్ పూర్తి చేసుకున్నారు. రానున్న రోజుల్లో వివిధ వ‌ర్గాల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక పోరాటాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పాల‌కుల‌పై వ్య‌తిరేక‌త పెంచ‌డంలో ఉద్యోగులు చాప కింద నీరులా…నిర్మాణాత్మ‌కంగా ప‌ని చేస్తారు. అందువ‌ల్ల ఉద్యోగుల విష‌యంలో పాల‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.