ఏపీ బడ్జెట్… తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పితే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రిగా మరో అరుదైన మైలురాయిని అధిగమిస్తున్నారు. ఏపీ చరిత్రలో బడ్జెట్ ని లక్షకోట్లు దాటించిన ఘటన అప్పటి సీఎం వైఎస్…

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పితే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రిగా మరో అరుదైన మైలురాయిని అధిగమిస్తున్నారు. ఏపీ చరిత్రలో బడ్జెట్ ని లక్షకోట్లు దాటించిన ఘటన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. లక్షకోట్ల బడ్జెట్ అంటే మాటలుకాదు, చేతల్లో చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజాసంక్షేమ పథకాల కోసం బడ్జెట్ కేటాయింపుల్ని భారీగా పెంచేశారు అప్పటి సీఎం వైఎస్సార్.

అయితే అది ఆర్థికమంత్రి రోశయ్యకి మాత్రం తలనొప్పిగా మారింది. ఇన్ని కేటాయింపులు నా వల్ల కాదు బోబోయ్ అంటూనే అధినేత ఆదేశాల మేరకు పని పూర్తిచేశారు. లక్ష కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడుతూ.. అసలీ బడ్జెట్ కేటాయింపులు చేయలేమని వైఎస్సార్ కి చెప్పినా ఆయన వినలేదని రోశయ్య చెప్పుకొచ్చారు. చేతికి ఎముకే లేదన్నట్టు రాజశేఖర్ రెడ్డి అందరికీ హామీలిస్తూ వచ్చారని, వాటన్నిటినీ బడ్జెట్ లో గుదిగుచ్చి కేటాయింపులు చేసేసరికి తలప్రాణం తోకకి వచ్చిందని అన్నారు అప్పట్లో. ప్రజల కోసం వైఎస్సార్ పడుతున్న కష్టం ముందు తన కష్టం ఎక్కువేమీ కాదని కూడా బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఈసారి 2 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు జగన్. ఆ అరుదైన మైలురాయిని దాటే అవకాశం ఈసారి ఆర్థికమంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ కి దక్కింది. ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో టీడీపీ 2.26 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినా.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ని తయారు చేసే అవకాశం వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఏ దశలోనూ జవసత్వాలు అందించాలని ఆలోచించలేదు టీడీపీ ప్రభుత్వం.

బడ్జెట్ కేటాయింపులన్నీ బూటకమే. కులాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకి ఏ సంవత్సరమూ పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపలేదు. సంక్షేమ పథకాలకు సైతం కోత విధించేసి.. ప్రచారానికి, సొంత ఆర్భాటానికి కోట్లు తగలేశారు. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి 1.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కేటాయింపుల్లో 60శాతం కూడా ఖర్చు చేయలేదనేది వాస్తవం. ఇక హడావుడిగా 2019-2020కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని 2లక్షల కోట్లు దాటించినా కేటాయింపుల్లో మమ అనిపించేశారు అప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తనది కానప్పుడు ఏదైనా దానం చేస్తామన్నట్టుగా బడ్జెట్ ని 2 లక్షల కోట్లు దాటించేశామంటూ గొప్పలు చెప్పుకున్నారు.

కానీ అసలైన బడ్జెట్ ఇప్పుడు జగన్ హయాంలో బయటకు వస్తోంది. ఇప్పటికే జగన్ ప్రకటించిన పథకాలు, పెంచిన జీతాలతో.. ఆర్థిక మంత్రిపై విపరీతమైన ఒత్తిడి ఉంది. కేటాయింపులపై జరిగిన కసరత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. నవరత్నాలకు అధిక ప్రాధాన్యమిస్తూ, దుబారాని పూర్తిగా తగ్గిస్తూ బడ్జెట్ తయారు చేశారు. పూర్తి స్థాయిలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ని తయారు చేసి సంక్షేమ పథకాల అమలులో తండ్రిని మించిన తనయుడుగా నిలవబోతున్నారు సీఎం జగన్. 

అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!