రికార్డ్… ఒకే రోజు 101 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొన్నటికిమొన్న ఒకే రోజు 60 మంది డిశ్చార్జ్ కాగా.. గడిచిన 24 గంటల్లో మరో 101 మంది కోలుకొని పూర్తి ఆరోగ్యంతో…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొన్నటికిమొన్న ఒకే రోజు 60 మంది డిశ్చార్జ్ కాగా.. గడిచిన 24 గంటల్లో మరో 101 మంది కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ఒకే రోజులో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా పరంగా చూసుకుంటే ఇదే అత్యథికం. దీంతో ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక్కసారిగా 1353కు చేరింది.

ఇక కరోనా కేసులు కూడా గడిచిన 3 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించిన వలస కార్మికుల్ని మినహాయిస్తే.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు తక్కువగా ఉంటున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 9628 శాంపిల్స్ ను పరీక్షించగా.. అందులో 48 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్థారణ అయింది.

అయితే ఈ 48 మందిలో 31 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అంటే రాష్ట్రంలో నికరంగా నమోదైన కేసుల సంఖ్య 17 మాత్రమే. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలులో 9 పాజిటివ్స్ వెలుగుచూడగా.. ఆ 9 మంది తమిళనాడు నుంచి వచ్చిన వలసకూలీలే. అటు చిత్తూరులో నమోదైన 8 కేసులు, నెల్లురూలో నమోదైన 9 కేసులు కూడా తమిళనాడు నుంచి వచ్చినవే. అలా 31 కేసులు తమిళనాడు కోయంబేడు ప్రాంతం నుంచి వచ్చినవే.

ఇక జిల్లాలవారీగా చూసుకుంటే.. తాజా ఫలితాలతో కర్నూలు జిల్లా 600 మార్క్ దాటి, 608గా నమోదైంది. అటు కడపలో కూడా కేసుల సంఖ్య వంద దాటగా.. గుంటూరులో 413, కృష్ణాలో 367, చిత్తూరులో 173కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల కర్నూలు జిల్లాలో ఒకరు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 49కు చేరుకుంది.

ఓవరాల్ గా రాష్ట్రంలో కేసుల సంఖ్య 2205కు చేరుకోగా.. 1353 మంది డిశ్చార్జ్ అయ్యారు. 49 మంది మృతిచెందగా.. 803 మందికి చికిత్స కొనసాగుతోంది.

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం