కరోనా కేసుల్లో చైనాను భారత్ అధిగమించింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 3970 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 85,940కు చేరుకుంది. దీంతో చైనాలో మొత్తం కేసుల సంఖ్య (82,933) కంటే ఇండియాలో నమోదైన కేసులే ఎక్కువ. తాజా సంఖ్యతో కరోనా బాధిత దేశాల జాబితాలో భారత్ 11వ స్థానానికి చేరుకుంది.
అయితే మృతుల పరంగా చూసుకుంటే భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 103 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2752కు చేరుకుంది. మిగతా ప్రపంచదేశాలతో పోల్చి చూస్తే ఇది చాలా తక్కువ. ఇప్పటివరకు అమెరికాలో 88,507 మంది, బ్రిటన్ లో 33,998 మంది, ఇటలీలో 31,610 మంది, ఫ్రాన్స్ లో 27,529 మంది కరోనా వల్ల మృతిచెందారు.
ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 29వేలకు చేరుకుంది. అటు మరణాల సంఖ్య వెయ్యి దాటిపోయింది. గుజరాత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పది వేలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య 600 దాటేసింది. తమిళనాడులో కేసుల సంఖ్య 10వేలు దాటింది. ప్రస్తుతం ఈ 3 రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా 85వేల940 కేసులుండగా.. 2752 మంది మృతిచెందారు. 30వేల మందికి పైగా డిశ్చార్జ్ అవ్వగా.. 53వేల మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా చూసుకుంటే.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఈ నెలలోనే లక్షకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.