ఈ మరణ మృదంగానికి బాధ్యులెవరు..?

కరోనా లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని, వాహనాలు లేకపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయిందని అందరూ సంబరపడ్డారు. కరోనాతో వచ్చిన ప్రాణ నష్టం కూడా పెద్దగా లేకపోవడంతో ఊపిరి…

కరోనా లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందని, వాహనాలు లేకపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయిందని అందరూ సంబరపడ్డారు. కరోనాతో వచ్చిన ప్రాణ నష్టం కూడా పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ కరోనా చేసిన నష్టం కంటే.. ప్రభుత్వం చేసిన నష్టమే వలస కూలీలకు శాపంగా మారింది.

ఉన్నఫలంగా ప్రజారవాణా వ్యవస్థను నిలిపివేయడంతో వలస కూలీలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు సడలించి ప్రత్యేక రైళ్లలో వారిని తరలిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, రైళ్లకంటే 100రెట్లు ఎక్కువ మంది కాలినడకను ఆశ్రయించారు.

ఓవైపు వాహనాలు సిద్ధం చేశామంటూ ప్రభుత్వాలు చెబుతున్నా, మరోవైపు కూలీలంతా రోడ్లపై కాళ్లరిగేలా నడుస్తున్నారు. అయినవాళ్లను భుజాన మోస్తున్నారు, సూట్ కేసులపై పెట్టి లాక్కెళుతున్నారు, దారిలోనే బిడ్డను కని పసికందుతో వందల కిలోమీటర్లు వెళ్తున్న బాలింతలున్నారు. డబ్బుకోసం ఎద్దుని అమ్మి యజమానే మరో కాడెద్దుగా మారి బండిలాగుతున్నాడు. ఇలాంటి దృశ్యాలన్నీ గుండెల్ని పిండేసేవే.

మీడియా కంటికి కనపడ్డ ఆ సన్నివేశాలు, ప్రభుత్వాలకు ఎందుకు కనపడవు? రోడ్డు మీద కష్టాలు పడేవారు కొందరయితే రోడ్డు ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నవారు మరికొందరు. రైలు పట్టాలపై శవాలు తేలిన వారం రోజుల లోపే వరుస రోడ్డు ప్రమాదాలతో వలస కూలీలు ఇంటికంటే ముందే మృత్యుఒడికి చేరుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు బాధ్యులెవరు. ఈ తెల్లవారుఝామున తెలంగాణ జిల్లాల్లో జరిగిన వరుస ప్రమాదాలకు ఎవరు సమాధానం చెబుతారు. చివరకు సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వాన్ని కడిగేసింది. రోడ్లపైనే వలస బతుకులు తెల్లారిపోతుంటే మాస్క్ లేసుకోండి, శానిటైజర్లు రుద్దుకోండి, కంపెనీలకు రాయితీలిచ్చాం అని చెబుతున్న ప్రబుద్ధులు ఎందుకు వేగంగా స్పందించరు. అన్నీ పక్కనపెట్టి ముందు వలస కూలీలను ఇంటికి పంపించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన ఎందుకు చేయరు? ఏ ఊరికావూరు, ఎక్కడికక్కడ వలస కూలీలను తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేపట్టవు.

20 లక్షల కోట్ల ప్యాకేజీలో కనీసం 200 కోట్లు వలస కూలీల తరలింపు కోసం కేటాయిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? ఎలాగూ లాక్ డౌన్ గేట్లు ఎత్తేశారు కదా.. రైళ్ల సంఖ్య పెంచి, బస్సుల్ని వదిలి ఎక్కడివారినక్కడ ఇళ్లకు పంపిస్తే ఈ మరణాలుండేవి కాదు కదా? వైన్ షాపులు తెరవడానికి పర్మిషన్ ఇచ్చిన కేంద్రం, బస్సులు నడుపుకోడానికి ఎందుకు ముందూ వెనకా ఆలోచిస్తోంది.

ఏదేమైనా కరోనా కంటే కేంద్ర ప్రభుత్వ తాత్సారమే వలస కూలీలకు శాపంగా మారింది. అందుకే రైల్వే ట్రాక్ లు, రోడ్లు నెత్తురోడుతున్నాయి. వలస బదుకు ఛిద్రమౌతోంది.

విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం