కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రైతులకు సంఘీభావంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ సమావేశాలకు హజరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో రాహుల్ గాంధీ ట్రాక్టర్ విన్యాసం సాగింది.
ట్రాలీ లేని ట్రాక్టర్ ఇంజన్ లో తన పార్టీ నేతలను ఇరు వైపులా కూర్చోబెట్టుకుని దూసుకుపోయారు రాహుల్ గాంధీ. ఇలా తన ట్రాక్టర్ డ్రైవింగ్ స్కిల్స్ ను రాహుల్ చాటుకున్నారు.
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆది నుంచి ట్రాక్టర్ల నే ఈ నిరసన ప్రదర్శనల్లో బాగా ఉపయోగించుకుంటున్నారు. పంజాబ్, హర్యానాల నుంచి రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లలో రావడం, ట్రాక్టర్ లతో ర్యాలీలు చేపట్టడం వంటివి చేశారు. ఈ క్రమంలో రాహుల్ కూడా ట్రాక్టర్ ఎక్కి పంజాబ్ ఎన్నికల ముందు విన్యాసం చేయడం ఆసక్తిదాయకంగా మారింది.
ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు ఇలాంటి విన్యాసాలు చేయడం మామూలే. ట్రాక్టర్లు, ఆటోలు, ఎలక్ట్రిక్ బైకులు నడుపుతూ నేతలు నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. గతంలో బీజేపీ వాళ్లూ ఇలాంటి విన్యాసాలు చేసే వారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, కాయగూరల ధరలు పెరగడం, గ్యాస్ ధరల పెంపు వంటి అంశాలపై ఈ తరహా నిరసనలు తెలిపేవారు. అయితే ఇప్పుడు ఆ ధరల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదంటూ వారు తేల్చేస్తున్నారు. ధరల పెరుగుదలతో తమకు సంబంధం లేదంటున్నారు!
అలాగే రాహుల్ గాంధీ ట్రాక్టర్ డ్రైవింగ్ చూశాకా.. ఏపీలో కూడా లోకేష్ ఇలాంటి విన్యాసం చేయడం గుర్తుకు రావొచ్చు. కొన్ని నెలల కిందట ఇలాగే ట్రాక్టర్ నడపబోయి లోకేష్ భంగపడ్డాడు.
ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకోలేక దాన్ని చిన్న వంతెన మీద నుంచి కిందకు వదలబోయారు. అయితే చుట్టూ ఉన్న వాళ్లు అలర్ట్ అయ్యి ప్రమాదాన్ని నివారించారు. అప్పట్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. మొత్తానికి ట్రాక్టర్ నడిపే పరీక్షలో లోకేష్ ఫెయిల్ అయితే, రాహుల్ మాత్రం విజయవంతంగా దూసుకుపోయాడు!