మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరిన్ని చిక్కులు తలెత్తనున్నాయి. తమ పథకాల అమలు కోసం ఇస్తున్న నిధులను ఇక మీద ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేసే విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ విధానాలు జగన్ ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కానున్నాయి.
ఇంత కాలం కేంద్రప్రభుత్వ పథకాలకు వచ్చే నిధులను రాష్ట్ర పథకాలకు మళ్లించుకుంటూ, ఆ తర్వాత ఆర్థిక వెసులుబాటును బట్టి తిరిగి వాటికి అందజేయడం తెలిసిందే. ఇది గత కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. అయితే మోడీ సర్కార్ మాత్రం తమ నిధులను కేవలం తమ పథకాలకు మాత్రమే ఖర్చు చేసేలా విధానపరమైన, కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఒక్క జగన్ ప్రభుత్వానికే మాత్రమే కాకుండా రాష్ట్రాలన్నింటికి కూడా చెక్ పెట్టినట్టే.
ఎందుకంటే కేంద్రప్రభుత్వ నిధులను కూడా తమ ఖాతాలోనే వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుండడం తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయం చర్చించాక ఈ మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. కొత్త విధానాల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా ఏర్పాట్లు చేసి తమకు తెలియ జేయాలని కోరింది.
ఇప్పటికే ఇందుకు 20 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా ఓకే చెప్పలేదు. కొత్త విధానంతో ఆర్థిక నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని, ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటున్న కేంద్ర నిధులను ఇకముందు అలా ఖర్చుచేసే పరిస్థితులు ఉండవనే ఉద్దేశంతో జగన్ సర్కార్ అంతర్మథనం చెందుతోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్రం 25% లోపు మాత్రమే నిధుల్ని రాష్ట్రాలకు ఇస్తుంది. రాష్ట్రం తన వాటా నిధులను కూడా జతచేసి అందులో 75% ఖర్చు చేసిందని నిర్ధారించుకున్న తర్వాతే మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఒకవేళ ఏవైనా కారణాలతో నిధులు ఖర్చు చేయకపోతే మాత్రం …ఆ సొమ్మంతా తిరిగి నోడల్ ఏజెన్సీ ఖాతాలకు తిరిగి జమ చేయాల్సి చేయాల్సి వుంటుంది.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి రావడం గమనార్హం. ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత పథకాలకు మళ్లించు కుంటూ నెట్టుకొస్తున్న ప్రభుత్వాలకు ఇది పిడుగుపాటే అని చెప్పక తప్పదు.
ఎందుకంటే కేంద్రం నిధులను వాడుకునే అవకాశం లేకపోగా, తిరిగి తమ వాటాను కూడా జమచేయాల్సి రావడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఏపీ లాంటి రాష్ట్రాలకు చాలా నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకుంది.