టాలీవుడ్ Vs ఏపీ సర్కార్.. ప్రస్తుతానికి మధ్యేమార్గం

ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లను తిరిగి పెంచుతారని ఇన్నాళ్లూ ఎదురుచూసింది టాలీవుడ్. ఈ మేరకు కొంతమంది ప్రతినిధుల బృందం ఏపీ ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది. కానీ ఇవేవీ ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్…

ఏపీలో తగ్గించిన టిక్కెట్ రేట్లను తిరిగి పెంచుతారని ఇన్నాళ్లూ ఎదురుచూసింది టాలీవుడ్. ఈ మేరకు కొంతమంది ప్రతినిధుల బృందం ఏపీ ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపింది. కానీ ఇవేవీ ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ తో సంబంధం లేకుండా కొన్ని చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఇప్పుడు వీటి రెవెన్యూ ఆధారంగా ఇతర మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల విడుదల తేదీలు ఆధారపడి ఉన్నాయి.

ఈనెల 30 నుంచి నైజాంలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకోబోతున్నాయి. ఆ రోజున ఇష్క్, తిమ్మరుసు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ మేరకు ఆ సినిమా యూనిట్లు ప్రచారాన్ని కూడా భారీ ఎత్తున చేస్తున్నాయి. ఇక ఏపీలో కూడా ఈ రెండు సినిమాలు పరిమిత స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. గిట్టుబాటు కాదనుకున్న థియేటర్లు మూసి ఉంచుతున్నారు. ఎంతో కొంత రెవెన్యూ వస్తుందనుకున్న యాజమాన్యాలు థియేటర్లు తెరుస్తున్నాయి.

ఉదాహరణకు ఇష్క్ సినిమానే తీసుకుంటే, ఆంధ్రాలోని కొన్ని థియేటర్లను తెరిచేలా నిర్మాత ఎన్వీ ప్రసాద్ బాగానే లాబీయింగ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ షేరింగ్ మోడల్ ను కూడా మార్చారు. అలాగే అంధ్రాలోని మల్టీప్లెక్సులన్నీ తెరిచే ఉన్నాయి. సమస్యకు అసలు కారణమైన బి, సి సెంటర్లలోని కొన్ని థియేటర్లు మాత్రం మూసేసి ఉంచారు. అటు సీడెడ్ లో కూడా ఇదే పరిస్థితి. ఇష్క్ వరకు అక్కడ రెవెన్యూ  మోడల్ మారింది.

ఇప్పటివరకు సినీ నిర్మాతలకు అనుభవంలోకి రాని వింత పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. అందుకే ఇష్క్, తిమ్మరుసు సినిమాలపై ట్రేడ్ బాగా గురిపెట్టింది. ఈ సినిమాలు వచ్చిన వారం రోజుల వ్యవథిలో ఎస్ఆర్ కల్యాణమండపం, ఇప్పుడు కాక ఇంకెప్పుడు లాంటి మరో 2 చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.

వీటి టాక్, రెవెన్యూ మోడల్స్ చూసిన తర్వాత అప్పుడు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తారు. ఏపీలోని కొన్ని థియేటర్లు, సెంటర్ల నుంచి రెవెన్యూ తగ్గినప్పటికీ, ఓవరాల్ గా ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్, రెవెన్యూ రిస్క్ ఫాక్టర్ అంచనా వేసుకొని టక్ జగదీశ్, లవ్ స్టోరీ లాంటి సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇలా మధ్యేమార్గంగా సినిమాల్ని రిలీజ్ చేయాలని చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. ఓవైపు ఇలా సినిమాల్ని విడుదల చేస్తూనే, మరోవైపు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అనుకుంటోంది. ప్రస్తుతానికైతే ఈ మధ్యేమార్గం బాగుంటుంది కానీ.. ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలు విడుదలయ్యేసరికి మాత్రం టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి రావాల్సిందే. లేదంటే ఆ నిర్మాతలకు నష్టాలు తప్పవు.