అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 12న చేపట్ట తలపెట్టిన పాదయాత్రపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాదయాత్రకు పోలీసులు అనుమతించలేదు. అలాగని తిరస్కరించలేదు. దీంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అనుమతిపై అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు.
దీంతో ఇవాళ్టి విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతికి సంబంధించి శుక్రవారం ఏ సంగతీ చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పాదయాత్రకు సమయం లేకపోవడంతో ముందు రోజు అనుమతి తిరస్కరిస్తారా? అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం.
గతంలో తిరుపతికి చేపట్టిన పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత పాదయాత్రపై 65 కేసులు కూడా నమోదయ్యాయని వివరించారు. కానీ ఇవన్నీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులని అమరావతి పరిరక్షణ సమితి తరపు న్యాయవాది అన్నారు.
గురువారం సాయంత్రం లోపు అనుమతి విషయమై తమకు చెప్పాలని కోర్టు సూచించింది. లేదంటే శుక్రవారం ఉదయాన్నే మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరువైపు వాదనలు విని నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొంది.