లైగర్ సినిమా సక్సెస్ అయి వుంటే ఈపాటికి దర్శకుడు పూరి జగన్నాధ్ వైభవం మామూలుగా వుండేది కాదు. బాలీవుడ్ జనాలు ఆయన ఇంటి ముందు వుండేవారు. చార్మి మేడమ్…మేడమ్ అంతే అన్నట్లు వినిపించేది.
కానీ విధి చాలా చిత్రమైనది. లైగర్ విఫలమైంది. దీంతో ఇప్పుడు పూరి మీద విపరీతమైన వత్తిడి పెరుగుతోంది. గమ్మత్తేమిటంటే దర్శకుడిగా పూరి ఫెయిల్యూర్ అని ఎవ్వరూ అనడం లేదు. ఆయనకు ఆఫర్లు ఇవ్వడానికి జనం సిద్దంగానే వున్నారు. కానీ పిసి కనెక్ట్స్, చార్మి మాత్రం దూరంగా వుండాలనే కండిషన్ పెడుతున్నారు. చార్మిని ఎందుకు నిర్మాణంలో వేలు పెట్ట వద్దు అంటున్నారో అన్నది క్లారిటీ లేదు.
పూరితో జనగణమన ప్రాజెక్టు నిర్మాత మై హోమ్ రామ్ సినిమా చేయడానికి సిద్దంగా వున్నారు. ఆ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తం పూరి దగ్గర నుంచి 12 కోట్లు వెనక్కు రావాల్సి వుంది. బాలయ్యతో సినిమా చేద్దాం అనే ఆఫర్ అక్కడి నుంచి వస్తోంది. కానీ చార్మి, పూరి కనెక్ట్స్ వద్దు అంటున్నారు.
అలాగే చిరంజీవి-పూరి కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ అక్కడా పిసి కనెక్ట్స్ ను వద్దంటున్నారని బోగట్టా. పూరికి బాగా సన్నిహితమైన దర్శకుడి బృందం చార్మి విషయంలో నెగిటివ్ ట్రెండ్ ను కావాలనే సృష్టిస్తోందనే టాక్ కూడా వుంది. ఆ దర్శకుడికి, పూరికి ఒక్క చార్మి విషయంలోనే అభిప్రాయం కలవలేదని బోగట్టా. చిరకాలంగా పూరి-చార్మి స్నేహాన్ని బ్రేక్ చేయాలని ఆ దర్శకుడు ప్రయత్నం చేస్తూనే వున్నాడని తెలుస్తోంది.
ఇలా మొత్తం మీద పూరి కెరీర్ వ్యవహారం మొత్తం రింగ్ రోడ్ మాదిరిగా చార్మి చుట్టూనే తిరుగుతోంది.