బిగ్‌బాస్ రియాల్టీ షోపై సీపీఐ అగ్రనేత కె.నారాయణ తన ఆగ్రహాన్ని కొనసాగిస్తూనే వున్నారు. పదేపదే రియాల్టీ షోపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. మెగాస్టార్ చిరంజీవిపై ఇటీవల విమర్శలు చేసి, ఆ తర్వాత సారీ చెప్పిన నారాయణ, ఇవాళ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఇదే సందర్భంలో హీరో నాగార్జునపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మొట్టికాయలు వేశారు.
బిగ్‌బాస్ రియాల్టీ షో ఓ బ్రోతల్ హౌస్ అని తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు నారాయణ పేర్కొన్నారు. బ్రోతల్ హౌస్‌లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. మహిళలను కించపరిచినట్టు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్నారు. తనను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి వల్ల కాదని ఆయన హెచ్చరించారు. కళాకారులపై తనకు గౌరవం ఉందన్నారు.
కానీ సినిమా రంగం అంటే కేవలం హీరో నాగార్జున మాత్రమే కాదన్నారు. చిరంజీవికి, నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. డబ్బు కోసం నాగార్జున బిగ్‌బాస్ రియాల్టీ షో హోస్ట్‌గా చేస్తున్నారని విమర్శించారు. ఇదే చిరంజీవి విషయానికి వస్తే ప్రజారోగ్యం కోసం కోట్లాది రూపాయలను కాదనుకున్న వ్యాపార ప్రకటనలు వదులుకున్నారని ప్రశంసించడం విశేషం.
ఇక రాజకీయాల విషయానికి వస్తే ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విడిచిపెట్టలేదు. మునుగోడులో ఇప్పటికే టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ బలపడడానికి కేసీఆరే కారణమని మండిపడ్డారు. కేసీఆర్ తప్పుల వల్లే తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు. ఎంఐఎం భుజంపై తుపాకి పెట్టి కేసీఆర్‌ను బీజేపీ కాల్చుతోందని విమర్శించారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరుగున పరిచే కుట్ర జరుగుతోందని కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి కేసీఆర్ బయట పడాలని ఆయన సూచించారు.